వైసీపీ మునిసిపోల్ అక్రమాలపై ఫిర్యాదు: ఎస్ఈసీని కలిసిన తెలుగుదేశం నేతల బృందం.!
Published on: Tue Nov 3, 2026 3:35AM

మున్సిపల్ ఎన్నికల వేళ వైసీపీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందంటూ తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. వైసీపీ అగ్రనేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించారని ఆరోపిస్తూ ఫిర్యాదు అందజేశారు.
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎంఎల్‌సి వర్ల రామయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాని కలసి ఈ ఫిర్యాదు చేసింది. ఎస్ఈసీని కలిసిన బృందంలో వర్ల రామయ్య తో పాటు నాలెడ్జ్ కమిటీ చైర్మన్ గురజాల మాల్యాద్రి, జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధికారప్రతినిది బండారు వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.
.webp)
ఈ సందర్భంగా వారు పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
దీంతోపాటు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అక్రమాలను కూడా ప్రత్యేకంగా ఫిర్యాదులో ప్రస్తావించారు. 16వ డివిజన్లోని గుణదల ప్రాంతానికి చెందిన బూత్ నెంబర్ 5లో పోలింగ్ ప్రక్రియ సాఫీగా సాగుతున్న సమయంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా చొరబడ్డారని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధికార పరిధిని దాటి, పోలింగ్ కేంద్రాల్లోకి అనుచరులతో ప్రవేశించి ఓటర్లను భయపెట్టేలా వ్యవహరించిన దేవినేని అవినాష్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులను స్వీకరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా, ఈ అంశాలపై నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు. సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
[TDP Complaint SEC, Pulivendula Municipality Elections, Jagan, Provocation, Gunadala, Devineni Avinash, Booth Entry, AP Local Body Elections, Telugu One]


