కాంగ్రెస్ నేతలు కారుకి రిపేర్లు చేసుకోగలరా!

 

తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలకి ఇల్లలకగానే పండుగ కాదని తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టకపోవచ్చునేమో. ఆ సంగతి కారెక్కక మునుపే గ్రహించిన కేశవ్ రావు, తను ఎక్కబోయే కారుకి కొన్ని రిపేర్లు చేసుకోనయినా ప్రయాణం చేయక తప్పదని తన మనసులోమాటను ముందే బయటకి కక్కేశారు.

 

కాంగ్రెస్ నేతలకు తెరాస కండువా కప్పగానే, కేసీఆర్ “కాంగ్రెస్ నేతలు సన్నాసులు దద్దమ్మలు” అంటూ వారి సమక్షంలోనే తమ సహచరులను తిట్ల పురాణం లంకించుకొంటే వారు బిక్క మొహాలు వేసుకొని చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు. వారి ఆరాధ్య దేవత సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగును కూడా కేసీఆర్ వారి సమక్షంలోనే నోటికొచ్చినట్లు కడిగిపారేశారు. పార్లమెంటులో చప్రాసీకి కూడా తెలంగాణా ప్రజల గోడు అర్ధమయినప్పటికీ ఆ ఇద్దరికీ మాత్రం ఎందుకు అర్ధం కావట్లేదో అని కేసీఆర్ ఈసడిస్తుంటే ఔనని కాదనలేని నిస్సహాయత వారిది. లోక్ సభలో ఉన్న ప్రధానికి అసలు తమ మాటలు అర్ధం అవుతున్నాయో లేదో, అసలు ఆయన వింటున్నాడో లేదో తెలియని స్థితిలో రాయిలా కూర్చోంటాడని కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తుంటే వారి నోట మాటలేదు.

 

తెరాస తీర్ధం పూర్తిగా ఇంకా గొంతు దిగకముందే, కేసీఆర్ తన విశ్వరూపం చూపిస్తుంటే పాపం వారు కక్కలేక మింగలేక అవస్థలు పడ్డారు. బహుశః తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలకి ఇల్లలకగానే పండుగ కాదని అప్పటికే కొంత అర్ధం అయిఉండవచ్చును. కాంగ్రెస్, తెదేపాల తెలంగాణా నేతలు తెరాసలో చేరడానికి ఇప్పటికీ వెనుకంజ వేయడానికి ఇదే ప్రధాన కారణమని కేసీఆర్ తో సహా అందరికీ తెలుసు. కానీ, జనాన్ని చూడగానే పంచ్ డైలాగులు పలికి చప్పట్లు చరిపించుకొనే బలహీనత ఉన్న బక్కన్న కేసీఆర్ ని పార్టీలో ఎవరూ కూడా వారించలేరు కనుక కాంగ్రెస్ నేతలు కూడా కిక్కురుమనకుండా వినక తప్పలేదు.

 

ఇంత వరకు తెరాసలో విధాన పరమయిన నిర్ణయాలన్నిటినీ కేసీఆరే స్వయంగా తీసుకోవడం, దానికి మిగిలిన వారు ఆమోదించడం ఒక సాదారణ సంప్రదాయంగా వస్తోంది. మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చెప్పట్టబోతున్నకేశవ్ రావు కేసీఆర్ ని కాదని స్వయంగా నిర్ణయాలు తీసుకోగలరా? అంటే అనుమానమే.

 

ఇక మందా, వివేక్ ఇద్దరూ కూడా ఎన్నికలలో పోటీ చేసేవరకు పార్టీలో చేసేదేమీ ఉండకపోవచ్చును. మహా అయితే సభలలో కేసీఆర్ అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీని, తెదేపాను తిట్టడానికి మాత్రమే వారికి అవకాశం ఉంటుంది.

 

ఇక, కేవలం పార్టీ అధిష్టానాన్ని తప్ప మరెవరినీ ఖాతరు చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పని పరిస్థితి. ఇంత బ్రతుకు బ్రతికి చివరికి తెరాసలో డమ్మీలుగా మిగిలిపోతారా? లేక తమ రాజకీయ అనుభవంతో తామెక్కిన కారుని మరమత్తులు చేసుకొని, దాని డ్రైవర్ ని పక్కకు తప్పించి తామే స్టీరింగ్ దొరకబుచ్చుకొంటారా? అనేది త్వరలోనే తేలిపోతుంది. అయితే, కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్న రాములమ్మనడిగినా, మధ్యలోనే కారులోంచి దూకేసిన ఆలె నరేంద్ర, సమరసింహా రెడ్డి, మహేంద్ర రెడ్డి, రఘునందన్ రావు వంటి వారినడిగినా కారులో వెనుక సీటులో బుద్దిగా కూర్చోగలిగితే కూర్చోవాలి లేకుంటే మళ్ళీ స్వంత గూటికి వెళ్లిపోవాలని సలహా చేపుతారేమో.