TBZ Acquisition News: 74.12% వాటా కొనుగోలు చేసిన GRT జ్యువెలర్స్.. కారణాలు ఇవే!
Published on: Tue Sep 1, 2026 12:03PM

భారతీయ స్టాక్ మార్కెట్‌లో ట్రిభోవన్‌దాస్ భీమ్‌జీ జవేరి (TBZ) షేరు ధరకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.304.45 వద్ద ముగిసిన టీబీజెడ్ షేర్ ధర, సెప్టెంబర్ 1 ట్రేడింగ్ ప్రారంభంలో రూ.305.75 వద్ద ఓపెన్ అయి అంతర్గత గరిష్ట స్థాయి రూ.366.50 కి చేరింది. ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణం దేశంలోనే ప్రముఖ జ్యువెలరీ సంస్థ జి.ఆర్.తంగమాలిగై (GRT Jewellers) టీబీజెడ్ కంపెనీలో ఏకంగా 74.12 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రామోటర్లతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (SPA) కుదుర్చుకోవడమే. ఈ ఒప్పందం మొత్తం విలువ దాదాపు రూ.1,033.71 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పాటు సెబీ నిబంధనలకు అనుగుణంగా జీఆర్‌టీ సంస్థ మరో 26 శాతం వాటా కోసం కూడా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది.
1864లో శ్రీ భీమ్‌జీ జవేరి ద్వారా ముంబైలోని జవేరి బజార్‌లో ఒకే ఒక చిన్న దుకాణంగా ప్రారంభమైన టీబీజెడ్ ప్రయాణం, ఐదు తరాల పాటు 162 సంవత్సరాల ఘనమైన చరిత్రను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 37 స్టోర్లతో సుదీర్ఘ నమ్మకాన్ని గెలుచుకున్న ఈ సంస్థ ఇప్పుడు జీఆర్‌టీతో చేతులు కలిపి తన తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెడుతోంది. ఈ మెగా డీల్ వార్తలతో మార్కెట్లో టీబీజెడ్ స్టాక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కేవలం ఒక్క వారంలో 30.57 శాతం, గత నెల రోజులలో 46 శాతం రాబడిని అందించి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా విశేషమేమిటంటే ఈ ఏడాది కాలంలో అంటే YTD ఆధారంగా ఏకంగా 123 శాతం మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించగా, ఒక్క సంవత్సరంలో 95 శాతం పెరిగింది. దీర్ఘకాలికంగా చూస్తే మూడు సంవత్సరాలలో 212 శాతం, ఐదేళ్లలో 389 శాతం మరియు పదేళ్ల కాలంలో 424 శాతం భారీ లాభాలను నమోదు చేసింది.
why tribhovandas bhimji zaveri stock is rising,grt jewellers buys majority stake-in tbz.


