TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేరా బాప్ చోర్ హై నుండి మేక్ ఇన్ ఇండియా వరకూ.!

Published on: Sat Sep 12, 2026 3:24PM

హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్) సంస్థ తన తయారీ కేంద్రం నుంచి 400వ ఏహెచ్-64ఈ   అపాచే దాడి హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా బయటకు పంపడం ద్వారా రక్షణ రంగంలో దేశం సాధించిన   పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పింది. ఒకప్పుడు రక్షణ పరికరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపై ఆధారపడిన ఇండియా.. నేడు అమెరికా సైన్యంతో సహా ప్రపంచ దేశాలకు అత్యాధునిక హెలికాప్టర్ భాగాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగింది.  టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ సంస్థ, రక్షణ తయారీ రంగంలో దేశ పారిశ్రామిక సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది.  సుమారు 52 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ  కేంద్రంలో 750 మందికి పైగా ఇంజనీర్లు, నిపుణులు రోబోటిక్స్, ఆటోమేషన్ సాంకేతికతను ఉపయోగిస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

ఇక్కడ తయారవుతున్న ఫ్యూజ్‌లేజ్‌లు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సేవలలో ఉన్న అపాచే హెలికాప్టర్లలో అంతర్భాగంగా అమర్చబడుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా నిర్మింతమైన మొత్తం అపాచే హెలికాప్టర్లలో   30 శాతం ఫ్యూజ్‌లేజ్‌లు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే తయారవడం దేశం గర్వించదగిన విషయం.  భారత రక్షణ కొనుగోళ్లు, తయారీ చరిత్రను పరిశీలిస్తే, గతంలో బోఫోర్స్ వంటి ఒప్పందాలు ఎదుర్కొన్న వివాదాలు దేశ రక్షణ వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 80వ దశకం మధ్యలో జరిగిన ఈ ఒప్పందాలు,  తదనంతరం తలెత్తిన రాజకీయ కుంభకోణాలు దేశ రాజకీయ,  రక్షణ రంగాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. ఆ కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు,  చట్టపరమైన చిక్కుల కారణంగా దేశీయంగా స్వదేశీ సాంకేతికతను,  ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలను కొంతవరకు కోల్పోవలసి వచ్చింది.

అయితే, దశాబ్దాల కాలం పాటు నడిచిన ఆ నైతిక, న్యాయపరమైన సవాళ్లు,  వివాదాల నుండి పాఠాలు నేర్చుకున్న ఇండియా.. క్రమంగా తన విధానాలను మార్చుకుంటూ వచ్చింది.  

గత దశాబ్ద కాలంగా దేశంలో అమలులోకి వచ్చిన మేక్ ఇన్ ఇండియా, 'ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు రక్షణ రంగానికి సరికొత్త దిశను నిర్దేశించాయి. రక్షణ సేకరణ విధానాల సరళీకరణ, స్వదేశీకరణ జాబితాల రూపకల్పన, అలాగే ప్రైవేట్ రంగ భాగస్వామ్యం వంటి సంస్కరణలు దేశీయ తయారీ రంగానికి బలమైన పునాది వేశాయి. టాటా సంస్థ ఒక్కటే బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, ఎయిర్‌బస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ రక్షణ విడిభాగాల తయారీలో దేశాన్ని గ్లోబల్ హబ్‌గా మారుస్తుండటం విశేషం. దీని ఫలితంగా దేశంలో రక్షణ ఉత్పత్తి,  ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వృద్ధి  నమోదు అవుతోంది.  ప్రస్తుత రక్షణ రంగ అభివృద్ధి కేవలం కొన్ని సంస్థలకే పరిమితం కాకుండా.. వందలాది దేశీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎమ్ఎస్ఎమ్ఈ) కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతోంది. 

విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటూ, స్వదేశీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆయుధాలు,  రక్షణ పరికరాలను తయారు చేయడంలో భారత్ దూసుకుపోతోంది. భారత రక్షణ ఎగుమతులు ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరిస్తుండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇండియా  వాణిజ్య, వ్యూహాత్మక స్థానం మరింత బలపడుతోంది.  భవిష్యత్తులో రక్షణ ఉత్పత్తి రంగంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు దేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఫైటర్ జెట్ ఇంజిన్లు,  అత్యాధునిక రాడార్ వ్యవస్థల వంటి కొన్ని కీలక రంగాలలో ఇంకా విదేశీ సాంకేతికతపై   ఆధారపడటాన్ని పూర్తిగా తొలగించే దిశగా దేశీయ పరిశోధనలు జోరందుకుంటున్నాయి. ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు  ప్రణాళికలు అమలవుతున్నాయి. బోఫోర్స్ రోజుల నాటి   దిగుమతి సంస్కృతి నుండి నేడు ప్రపంచానికి ఆయుధ భాగాలు అందించే స్థాయికి ఎదిగిన భారత రక్షణ రంగా ప్రయాణం, భవిష్యత్తులో దేశాన్ని స్వావలంబన దిశగా తిరుగులేని శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావించవచ్చు. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    

[Tata Boeing Aerospace Limited  Apache Fuselage Hyderabad  Make in India Defence Production  Bofors Scandal History  Indian Defence Exports, Telugu One]