తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. మంత్రి కారు ఢీ కొని యువకుడి మృతి.!
Published on: Mon Sep 7, 2026 10:37AM
.webp)
తమిళనాడులో సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. చెన్నై సమీపంలోని కాట్టాన్‌పులత్తూర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారు తమిళనాడు సంక్షేమశాఖ మంత్రి కె. జగదీశ్వరిది కావడంతో ఈ ప్రమాదం రాజకీయంగా సంచలనానికి కారణమైంది. ఈ ప్రమాదంలో మృతుడిని ఇరైయంబు గా గుర్తించారు. ఆ యువకుడు ద్విచక్రవాహనంపై వెడుతుండగా, మంత్రి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు.

సోమవారం (సెప్టెంబర్ 7) ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మంత్రి చెన్నైకి బయలుదేరారు. ఆమె అధికారిక కాన్వాయ్, భద్రతా వాహనాలు ముందు వెళ్తుండగా, ఆమెకు సంబంధించిన వ్యక్తిగత కారు ఆ కాన్వాయ్‌ను అనుసరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.ఆ కారే ప్రమాదానికి కారణమైంది. ఆ కారులో మంత్రి ఉన్నారా? లేదా అన్న విషయంలో స్పష్టత లేకపోయినా.. మంత్రి కారు ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం పాలవ్వడంతో విషయం సీరియస్ గా మారింది.
అంతే కాకుండా ఈ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఎందుకంటే.. మంత్రి జగదీశ్వరి తన ఎన్నికల అఫిడవిట్ లో తన పేరు మీద వాహనం లేదని పేర్కొన్నారు. దీంతో మంత్రి కారు ప్రమాదానికి కారణం అవ్వడం, ఆ ప్రమాదంలో ఓ యువకుడు మరణించడంతో.. అసలా కారు ఎవరిపేరు మీద రిజిస్టరై ఉంది? ప్రమాదం జరుగుతున్న సమయంలో కారును నడుపుతున్నదెవరు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రమాదం విజయ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందని పరిశీలకులు అంటున్నారు.
[Tamil Nadu Minister car accident, 26 yr old killed Chennai, Minister Jegatheeswari controversy, Vijay government pressure,Telugu One]


