మౌలానా సాద్ కు ఢిల్లీ ప్రభుత్వ సహకారంపై ఇంటెలిజెన్స్ అనుమానాలు

విచారణకు రాకుండా, తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ ఇల్లు మారడంపై ఢిల్లీ సర్కిల్స్ లో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం లోని కొందరి పెద్దల సహకారం తోనే, మౌలానా సాద్ పోలీసులతో దోబూచులాడుతున్నారనే అనుమానాలను ఢిల్లీ పోలీసు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మౌలానాపై ఇప్పటికే రెండు కేసులు నమోదు కాగా, 2 వేల మందిపై లుక్‌ అవుట్ నోటీసుల జారీ అయ్యాయి. పోలీసుల నోటీసులను పట్టించుకోని సాద్, ఇల్లు మారటం పై ఇంటెలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  దేశ వ్యాప్తంగా కరోనా విస్తరించడానికి కారణమైన తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్న ఇంటిని కూడా మార్చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యాడన్న ఆరోపణలపై సాద్‌పై పోలీసులు నేరపూరిత హత్యయత్నం కింద కేసులు నమోదు చేశారు.
తాజాగా, నిన్న ఆయనపై మనీలాండరింగ్ కేసు కూడా నమోదైంది. దర్యాప్తు కోసం తమ ఎదుట హాజరు కావాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సాద్‌కు పలుమార్లు నోటీసులు పంపారు. వాటిని ఏమాత్రం పట్టించుకోని సాద్.. పరీక్షల్లో తనకు కరోనా సోకలేదని తేలిన తర్వాత ఇల్లు మారిపోయాడు.

తబ్లిగీ జమాత్ సదస్సుకు దేశం నలుమూలల నుంచీ హాజరైన వారిలో వెయ్యిమందికిపైగా కరోనా వైరస్ బారినపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సాద్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు వైరస్ సోకలేదని తేలింది. దీంతో అదే ప్రాంతంలో మరో ఇంటికి ఆయన మకాం మార్చినట్టు తెలుస్తోంది.

గతంలో హోం క్వారంటైన్‌లో ఉండడంతో సాద్‌ను పోలీసులు ప్రశ్నించలేకపోయారు. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. తాజాగా, అతడిపై పలు కేసులు నమోదు కావడంతో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సాద్ సహా 18మంది జమాత్ నేతలతో పాటు 2 వేల మంది సభ్యులు దేశం విడిచి వెళ్లకుండా ఢిల్లీ పోలీసులు లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు.