TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ ఇన్నింగ్స్: విండీస్ పై తొలి టి20: టీమ్ ఇండియా ఘన విజయం.!

Published on: Wed Oct 7, 2026 9:44AM

విండీస్ తో ఐదు టి20 సిరీస్ లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ కేప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.  టీమ్ ఇండియా బౌలర్ నామన్ ధీర్ అరంగేట్రం మ్యాచ్ లోనే మూడు వికెట్లతో సత్తా చాటాడు.   దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్  తొలుత  బౌలింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్‌కు శుభారంభం లభించినప్పటికీ భారత బౌలర్లు క్రమంగా పట్టు బిగించారు. ఓపెనర్ షాయ్ హోప్ 52 పరుగులతో రాణించగా.. షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో విండీస్ స్కోరు పుంజుకున్నా.. ఆ తర్వాత భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. చివరకు వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో అరంగేట్రం చేసిన నామన్ ధీర్  తన ఆఫ్‌స్పిన్‌తో కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ 31 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. షాయ్ హోప్, రొమారియో షెపర్డ్, షామర్ స్ప్రింగర్‌లను పెవిలియన్‌కు పంపాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ సాధించారు.

172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అభిషేక్ శర్మ 21 పరుగులు,  సంజూ శాంసన్ 11 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 137 పరుగుల అజేయ భాగస్వామ్యంతో  జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరిలో ముఖ్యంగా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్  10 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి.. కేవలం 42 బంతుల్లోనే శతకబాదాడు.   43 బంతుల్లో 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు. మరో వైపు ఇషాన్ కిషాన్ ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో టీమ్ ఇండియా   14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. 

శ్రేయస్ అయ్యర్‌కు ఇది టీ20  క్రికెట్‌లో తొలి సెంచరీ. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు నుంచి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే అతడు ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న రాంచీలో జరగనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లభించిన సానుకూలతను కొనసాగిస్తూ సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకోనుంది.

[T20 Series With Windies, 1st T20 Shreyas Iyer century, Naman Dhir debut, India vs West Indies 1st T20I, IND vs WI 2026,  Shreyas Iyer 102,8Wickets Cictory, Telugu One]