స్టార్ లింక్ ఎంట్రీకి నో: కేంద్రాన్ని డిమాండ్ చేసిన స్వదేశీ జాగరణ్ మంచ్.!
Published on: Wed Oct 14, 2026 2:49PM

ఎలాన్ మస్క్ సాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ కార్యకలాపాలపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత రోజు రోజుకూ తీవ్రమౌతోంది. దేశ సార్వభౌమత్వానికి, రక్షణ రంగానికి ఈ ప్రాజెక్ట్ నుంచి ముప్పు పొంచిఉందన్న ఆందోళనలతో జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆర్థిక అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్ మంచ్ స్టార్‌లింక్ సేవలను దేశంలో పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి ఎలాంటి విదేశీ టెలికాం, సాటిలైట్ దిగ్గజాలకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం స్టార్‌లింక్ అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానమే. ఆ సంస్థ వినియోగిస్తున్న సాటిలైట్-టు-సాటిలైట్ లేజర్ లింక్ టెక్నాలజీ ద్వారా డేటా నేరుగా ఇండియన్ గేట్వేలను తాకకుండా విదేశాలకు చేరే అవకాశం ఉందని నిపుణులు, ఎస్జేఎం నేతలు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ నిబంధనలను, నిఘా వ్యవస్థలను తప్పించుకుని ఈ సమాచారం అంతర్జాతీయంగా ప్రసారమైతే, అత్యవసర సమయాల్లో దేశ భద్రతా దళాలకు, సంస్థలకు పెను ముప్పు తప్పదని ఎస్జేఎం అంటోంది. దేశ సరిహద్దులు దాటి వెళ్లే సున్నితమైన సమాచారానికి ఎలాంటి సార్వభౌమ పర్యవేక్షణ ఉండకపోవడం పెద్ద లోపం అంటున్నారు.

ఈ అంశంపై ఎస్జేఎం జాతీయ సహ-సంచాలకుడు అశ్విని మహాజన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ సంస్థల ఒత్తిళ్లకు లేదా వ్యాపార వాదనలకు తలొగ్గి నిబంధనలను సడలించవద్దని కేంద్రాన్ని కోరారు. టెలికాం రంగంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే పోటీతత్వంతో కూడిన డేటా సేవలను అందించే మార్కెట్‌గా ఎదిగిందని గుర్తుచేసిన ఆయన విదేశీ సంస్థల హార్డ్‌వేర్, రూటింగ్ ఆర్కిటెక్చర్‌పై పూర్తిస్థాయి స్పష్టత లేకుండా, రాకుండా వాణిజ్య పరమైన అనుమతులు ఇవ్వడం దేశ భద్రతను ప్రమాదంలో నెట్టడమేనన్నారు.
యూజర్ల నియంత్రణ కేంద్రాలు విదేశీ గడ్డపై ఉంటే, దేశ భద్రతా నిర్ణయాలను ప్రభావితం చేసే అదనపు లీవర్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో స్పెక్ట్రమ్ కేటాయింపులు, లైసెన్సింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్ మస్క్ ఇటీవల బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ రగడకు మరింత ఆజ్యం పోసింది.
నిబంధనలను వేగవంతం చేయాలని ఆయన ఒత్తిడి తెస్తున్న తరుణంలో, స్వదేశీ సంఘాల నుంచి ప్రతిఘటన ఎదురు అవుతోంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గతంలోనే స్పష్టం చేసినట్లుగా, విదేశీ హార్డ్‌వేర్, నెట్వర్క్ భద్రతా ప్రమాణాలను హోంశత్వ శాఖ ) నిశిత పరిశీలన తర్వాతే తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఉండాలి కూడా. దేశీయ ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ వృద్ధి చెందుతున్న తరుణంలో, విదేశీ నెట్‌వర్క్‌లపై అత్యధికంగా ఆధారపడటం భవిష్యత్తులో దేశీయ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని, అలాగే డేటా లోకలైజేషన్ నిబంధనలను అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలని భద్రతా నిపుణులు కోరుతున్నారు. విదేశీ సంస్థల నుంచి ఏ చిన్న నిబంధన ఉల్లంఘన జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సమాజం నుండి కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
[Swadeshi Jagaran Manc Demand Starlink India Ban, National Security Threat, Elon Musk Satellite Internet, RSS Affiliated SJM, Starlink Elan Musk, Telugu One]


