తిరుమలలో కొత్త అనుభూతి.. AI, 3D టెక్నాలజీతో ఎస్వీ మ్యూజియం ప్రారంభం..!
Published on: Wed Sep 16, 2026 2:43PM
.webp)
శ్రీవారి వైభవానికి టెక్నాలజీ టచ్.. తిరుమలలో అదిరిపోయే మ్యూజియం..!
తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి మ్యూజియంలోని విశేషాలను సీఎం పరిశీలించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను భక్తులకు తెలియజేసేలా మ్యూజియంలో అనేక ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు సహా పలువురు రాజులు, భక్తులు వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలతో పాటు చారిత్రక అంశాలను తెలిపే వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. శ్రీవారికి అలంకరించే వివిధ రకాల కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడళ్ల రూపంలో అందుబాటులో ఉంచారు.

పానోరమిక్ స్క్రీన్‌పై ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను ప్రదర్శిస్తున్నారు. తిరుమల కొండపై ఉన్న వివిధ ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి, భౌగోళిక విశిష్టతలను వివరించేలా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తిరుమల ఏడు కొండల త్రీడీ మోడల్‌ను కూడా సందర్శకులకు అందుబాటులో ఉంచారు. తిరుమలకు వచ్చి ఆయుధాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన వివిధ రాజ్యాల రాజులకు సంబంధించిన ఆయుధాలను కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. శ్రీవారిని కీర్తించిన అన్నమాచార్యులు సహా పలువురు భక్తులు ఉపయోగించిన సంగీత వాయిద్యాలను కూడా ఏర్పాటు చేశారు. చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ రూపొందించిన ఈ మ్యూజియం.. భక్తులకు తిరుమల వైభవాన్ని మరింత దగ్గరగా పరిచయం చేసేలా తీర్చిదిద్దారు.
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కడం తన అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ప్రాణభిక్ష పెట్టిన వెంకటేశ్వరస్వామికి ఎప్పుడూ కృతజ్ఞుడినని చెప్పారు. 1999లో తాను ప్రారంభించిన మ్యూజియంను సుందరీకరించి మళ్లీ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హోలోగ్రాఫిక్ డిజైన్లతో మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఒక ట్రస్ట్ ద్వారా మ్యూజియాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రమాదవశాత్తు భక్తులు మరణిస్తే రూ.2 లక్షల పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదనే నిబంధనను కఠినతరం చేశామని వెల్లడించారు.
వైకుంఠంలో పిల్గ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, క్యూ కాంప్లెక్స్‌లో లైవ్ మెడిటేషన్‌తో పాటు శ్రీవారి వైభవాన్ని తెలుసుకునే ఏర్పాట్లు చేశామని తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతోందని.. పూజా విధానాలు, ఆధ్యాత్మికతను పాటించడం ద్వారా మానసికంగా దృఢంగా ఉండొచ్చని అన్నారు.
ఆలయాలు, శ్రీవారి సేవ..!
శ్రీవారి దేవాలయం పేరుతో దేశవ్యాప్తంగా 5 వేల ఆలయాలను నిర్మించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు. చిన్న దేవాలయాలను పెద్ద దేవాలయాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. అవసరాన్ని బట్టి ఒక్కో ఆలయానికి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.టీటీడీ పరిధిలో 165 దేవాలయాలు ఉన్నాయని, వాటిలో 64 ఆలయాలు తిరుమల వెలుపల ఉన్నాయని తెలిపారు. ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్నప్రసాదానికి భారీగా విరాళాలు వస్తున్నాయని, అన్నప్రసాదంలో మజ్జిగ స్థానంలో పెరుగు అందించాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు.
వైద్య సేవలకు ప్రాధాన్యం..!
స్విమ్స్, రుయా, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమం ద్వారా 800 మంది వైద్యులు ముందుకొచ్చారని చెప్పారు. టాటా క్యాన్సర్ ఆసుపత్రి, అరవింద్ ఆసుపత్రి వంటి సంస్థలను అనుసంధానం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. వైద్యులు, విద్యా రంగానికి చెందిన వారు కూడా శ్రీవారి సేవకులుగా ముందుకొస్తున్నారని చెప్పారు. సేవకులకు తగిన శిక్షణ ఇచ్చి మరింత సమర్థవంతంగా సేవలు అందించేలా చేస్తామని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ..!
తిరుమలలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు 32 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు. వాటిని మరింత ఎక్కువ ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలను నెట్‌జీరోగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వ్యర్థాలను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా తిరుమలకు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తిరుమలలో ఇకపై అవసరం లేని నిర్మాణాలకు అవకాశం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.

'వృక్ష గోవిందం' కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని తెలిపారు. తిరుపతి పరిసరాలను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దుతామని చెప్పారు. కొండల్లోని నీటిని తిరుపతి పరిసరాల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..!
తిరుపతిలో స్కైవాక్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్‌కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గరుడ వారధిని కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు సుమారు రూ.230 కోట్లతో ఇంటి స్థలాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఉద్యోగులపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వం, టీటీడీ భాగస్వామ్యంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు సులభంగా చేరుకునే ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి మొత్తం పండుగ వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలను వెడ్డింగ్ డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
నీటి కొరత లేకుండా చర్యలు..!
తిరుమలలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. సోమశిల, కండలేరు నుంచి తిరుపతికి నీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. గతంలో నీటి కొరత కారణంగా ఆలయాన్ని మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని చర్చ జరిగినప్పుడు.. కళ్యాణి డ్యామ్ నుంచి నీటిని పంపింగ్ చేసి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు. తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం, టీటీడీ కలిసి పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.
[ SV Museum, Tirumala, Chandrababu Naidu, TTD, AI Technology, 3D Museum, Pilgrims Experience Centre, Tirumala Development, Lord Venkateswara, Tirupati, Spiritual Tourism, Net Zero Tirumala,TTD, BR Naidu, Anam Rama Narayana Reddy ]


