TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుడ్డు లో పచ్చ సొన గురించి ఈ నిజాలు తెలుసా.!

Published on: Sat Oct 3, 2026 10:42AM

ప్రతిరోజూ ఉదయం ఉడకబెట్టిన గుడ్డు తినడం చాలామందికి అలవాటు. శారీరక బలానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోడిగుడ్డును అత్యంత చౌకైన , సమర్థవంతమైన ఆహారంగా నిపుణులు చెబుతుంటారు. అయితే  చాలామంది గుడ్డు తినేటప్పుడు తెల్లసొనను మాత్రమే తిని, పచ్చసొనను తీసి పక్కన పడేస్తుంటారు. పచ్చసొన తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లేదా చెడు కొవ్వు పెరిగిపోతుందని, గుండె ఆరోగ్యానికి మంచిది కాదని, బరువు పెరుగుతారని రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు పచ్చసొన ఇస్తే అరగదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ కేవలం శాస్త్రీయ ఆధారం లేని అపోహలు మాత్రమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

నిజానికి గుడ్డులోని అసలైన పోషక నిధి పచ్చసొనలోనే దాగి ఉంటుంది.
పచ్చసొనలో ఉన్న ముఖ్యమైన పోషకాలు , వాటి ప్రాముఖ్యత
గుడ్డులోని సంపూర్ణ పోషక విలువలు మన శరీరానికి అందాలంటే పచ్చసొనను తీసివేయకుండా పూర్తిగా తినడం ఎంతో అవసరం. పచ్చసొనలో లభించే ప్రధానమైన పోషకాలు మన శరీరానికి ఏ విధంగా తోడ్పడతాయో వివరంగా తెలుసుకుంటే..

మెదడు అభివృద్ధికి..

గుడ్డు పచ్చసొనలో కోలిన్ అనే పోషక పదార్థం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది మెదడు సరైన రీతిలో పనిచేయడానికి , జ్ఞాపకశక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం. విశేషమేమిటంటే, ఎదుగుతున్న చిన్న పిల్లలలో మెదడు వికాసానికి , నరాల వ్యవస్థ నిర్మాణానికి కోలిన్ అత్యంత కీలకంగా పనిచేస్తుంది.

నరాల బలానికి, రక్తకణాల తయారీకి విటమిన్ బి12..

పచ్చసొనలో విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొత్త రక్తకణాలు తయారవ్వడానికి, శరీరం చురుగ్గా ఉండటానికి , నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. సాధారణంగా మనం తినే శాఖాహారంలో ఈ విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే శాఖాహార లోపాలను భర్తీ చేసుకోవడానికి గుడ్డు పచ్చసొన ఒక గొప్ప ఆహార మూలంగా పనిచేస్తుంది.

కంటి చూపుకు, రోగనిరోధక శక్తికి విటమిన్ ఏ..

 ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సాయపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి, పలురకాల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

థైరాయిడ్ పనితీరుకు సెలీనియం..

 గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే ముఖ్యమైన ఖనిజ లవణం ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి , శరీరంలో జీవక్రియల వేగాన్ని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

గుడ్డును పూర్తిగా ఎందుకు తినాలి?

గుడ్డు తెల్లసొనలో కేవలం ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది, కానీ పచ్చసొనలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ , మేలైన పోషకాలన్నీ నిండి ఉంటాయి. కేవలం తెల్లసొన మాత్రమే తింటే గుడ్డు నుంచి వచ్చే పూర్తి పోషకాహార ప్రయోజనాలను మనం కోల్పోయినట్లే అవుతుంది.

అందుకే అనవసరమైన భయాలు, అపోహలు పక్కన పెట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును పచ్చసొనతో సహా పూర్తిగా తీసుకోవడం వల్ల  ఆరోగ్యం ఎంతగానో మెరుగవుతుంది. 

                    *రూపశ్రీ.