TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

10 వేల జీతం ఇవ్వలేదని: 24 కోట్ల ఆస్తి తగలబెట్టాడు..ఈ షాకింగ్ ఘటన ఎక్కడంటే.!

Published on: Wed Sep 23, 2026 6:39PM

గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఒక సంచలన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం పది వేల రూపాయల బకాయి జీతం కోసం ఓ మాజీ అకౌంటెంట్ చేసిన దురాఘాతం ఏకంగా రూ. 24 కోట్ల భారీ నష్టానికి దారితీసింది. సూరత్‌లోని ప్రసిద్ధ శ్యామ్ సంగిని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన భారీ అగ్నిప్రమాదం వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. మొదట సాధారణ ప్రమాదంగా భావించిన ఈ ఘటన, ఒక మాజీ ఉద్యోగి పన్నిన పక్కా ప్లాన్ అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వినోద్ సవ్లే అనే 33 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ధులే ప్రాంతానికి చెందిన వినోద్ సవ్లే, సూరత్‌లోని హనుమాన్ ప్రసాద్ జవార్ టెక్స్‌టైల్ దుకాణంలో గత ఏప్రిల్ నుంచి అకౌంటెంట్‌గా పనిచేశారు. అతనికి నెలకు రూ. 30,000 వేతనం చెల్లించేవారు. అయితే ఆ దుకాణంలో పనిచేస్తున్న సమయంలో యజమాని  మరో అకౌంటెంట్ తన పనితీరును తప్పుపడుతూ నిత్యం వేధించారని, తీవ్ర అవమానానికి గురిచేశారని వినోద్ ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక అతను ఉద్యోగం మానేశాడు.

ఉద్యోగం మానేసే సమయానికి తనకు రావాల్సిన జీతంలో రూ. 10,000 బకాయి ఉందని, దానిని అడిగితే దుకాణ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకున్నాడని వినోద్ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. తనను అవమానించిన యజమానికి ఎలాగైనా గుణపాఠం నేర్పాలని భావించిన అతను, షాపులోని సరుకులకు నిప్పు పెట్టాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 8వ తేదీన రూ. 150 పెట్రోల్ పోయించుకుని, దానిని ఒక ప్లాస్టిక్ సంచిలో భద్రంగా తీసుకువెళ్లాడు.

అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని సమయం చూసి మార్కెట్ భవనం లోపలికి ప్రవేశించిన వినోద్, ఆరో అంతస్తులో ఉన్న తన మాజీ యజమాని దుకాణం బయట ఉంచిన వస్త్రాల పార్శిల్స్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు. అయితే కొద్దిసేపటికే మంటలు ఉద్ధృతంగా వ్యాపించి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా అంటుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 17 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నలుగురు వేర్వేరు వ్యాపారులకు చెందిన సుమారు రూ. 24 కోట్ల విలువైన వస్త్రాలు, దుస్తులు కాలి బూడిదయ్యాయి.

హనుమాన్ ప్రసాద్ జవార్ దుకాణంలో రూ. 6 కోట్ల నష్టం వాటిల్లగా, అభిషేక్ సోని దుకాణంలో రూ. 2 కోట్లు, అనురాగ్ జలాన్ దుకాణంలో రూ. 12 కోట్లు, హరిప్రసాద్ జవార్ దుకాణంలో రూ. 4 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. పోలీసులు సుమారు 1,500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న వినోద్, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రాజస్థాన్‌లోని ఖాటుశ్యామ్ ఆలయానికి, ఆ తర్వాత అయోధ్యకు పారిపోయాడు. తన దగ్గర ఉన్న రూ. 13,000 నగదు అయిపోవడంతో, పోలీసులు వెతకడం మానేసి ఉంటారనే భ్రమతో తిరిగి సూరత్‌కు చేరుకున్నాడు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అతన్ని దిండోలి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. కేవలం పది వేల రూపాయల చిన్న వివాదం ఇంతటి భారీ వినాశనానికి దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.

 

 

 

[ Surat textile market fire, accountant arrested, Rs 24 crore loss, salary dispute arson, Gujarat news, Shyam Sangini market,  Telugu One, Telugu News ]