జర్నలిస్టులపై అక్రమ కేసులకు తావు లేదు: సుప్రీం ధర్మాసనం తీర్పు.!
Published on: Wed Nov 4, 2026 11:12AM
.webp)
దేశవ్యాప్తంగా పత్రికలు, శాటిలైట్ ఛానెల్స్, డిజిటల్ మీడియా యూట్యూబ్ మాధ్యమాల్లో పెన్ను పట్టుకుని, వీడియో కెమెరా భుజాన వేసుకుని నిరంతరం ప్రజాహిత వార్తలు ప్రసారం చేస్తున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులేనని సుప్రీం కోర్టు పేర్కొంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి బాగోతాలు, అక్రమ దందాలు, రాజకీయ నాయకుల అవినీతి, అక్రమాలు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగే అక్రమాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే మీడియా ప్రతినిధులపై కొందరు కక్షసాధింపు చర్యల్లో భాగంగా బనాయించే అక్రమ కేసులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు లేదా అవినీతికి పాల్పడే వ్యక్తులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి జర్నలిస్టులపై అక్రమంగా బనాయించే తప్పుడు కేసులకు ఇకపై తావు ఉండదని పేర్కొంది. సమాజానికి నిజాలు తెలియజేసే క్రమంలో నిజాయితీగా విధులు నిర్వర్తించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ధర్మాసనం ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ స్థంబంగా భావించే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎలాంటి చర్యలు ఉన్నా వాటిని న్యాయస్థానాలు ఉపేక్షించవని తీర్పు వెలువరించింది.

ప్రింట్ మీడియా, శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ మాధ్యమాల్లో పనిచేస్తూ ఆయా అధికారిక జర్నలిస్ట్ సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉన్నవారిపై నమోదయ్యే కేసులు నిజమైనవా లేక అక్రమంగా బనాయించినవా అనే అంశాన్ని పరిశీలించి పరిష్కరించే పూర్తి అధికారం ఆయా జర్నలిస్ట్ సంఘాలకే ఉంటుందని కోర్టు పేర్కొంది. సంఘాల ద్వారా ఈ విషయమై వారం రోజుల్లోనే తగిన నిర్ణయం తీసుకునేలా వెసులుబాటు కల్పించింది. జర్నలిస్ట్ సంఘాల నిర్ణయాన్ని లేదా నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎవరైనా కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించినట్లయితే, అటువంటి ఫిర్యాదులు స్వీకరించినా లేదా దర్యాప్తు పేరుతో వేధించినా పోలీసులపై కూడా చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది.గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, అవినీతి బాగోతాలు బయటపడకుండా ఉండేందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
[Supreme Court Verdict On Journalists, Illegal Cases, journalists, Press Freedom, Journalist Associations, Telugu One]


