Latest News
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు ... సుప్రీంకోర్టు సంచలన తీర్పు
posted on: Mar 24, 2026 3:21PM
.webp)
హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు ఎస్సీ (షెడ్యూల్డ్ కులాల) హోదా వర్తించదని, తద్వారా వారు ఎస్సీ రిజర్వేషన్లు లేదా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందలేరని సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకున్నప్పుడు, పుట్టుకతో వచ్చిన కుల హోదా ఆటోమేటిక్‌గా రద్దవుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి తనపై జరిగిన దాడికి సంబంధించి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, సదరు వ్యక్తి గత పదేళ్లుగా క్రైస్తవ మతంలో కొనసాగుతూ, పాస్టర్‌గా సేవలు అందిస్తున్నారని ప్రత్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్రైస్తవంలో కుల వివక్ష ఉండదు కాబట్టి, మతం మారిన వ్యక్తి ఎస్సీ చట్టాన్ని ఆశ్రయించడం చెల్లదని వారు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు గతంలోనే ఆ కేసును కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.
రాజ్యాంగంలోని 1950 (షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్‌ను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ప్రస్తావించింది. ఈ నిబంధన ప్రకారం కేవలం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలను అనుసరించేవారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని న్యాయస్థానం వివరించింది. క్రైస్తవ లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన వెంటనే సదరు వ్యక్తి ఎస్సీ హోదాను కోల్పోతారని, ఇది ఎటువంటి మినహాయింపులు లేని స్పష్టమైన నిబంధన అని ధర్మాసనం తేల్చిచెప్పింది.
పిటిషనర్ గత పదేళ్లుగా క్రైస్తవ మతాచారాలను పాటిస్తున్నారని, ఆయన ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహిస్తున్నారని ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఒక వ్యక్తి తన పాత మతాన్ని వీడి వేరే మతాన్ని స్వీకరించినప్పుడు, రాజ్యాంగపరంగా ఎస్సీలకు లభించే ప్రయోజనాలు, రక్షణలు లేదా రిజర్వేషన్లను ఏ రూపంలోనూ పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. కేవలం కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉన్నంత మాత్రాన, మతం మారిన తర్వాత ఎస్సీ చట్టం కింద రక్షణ పొందలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ తీర్పు భవిష్యత్తులో మతం మారిన దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల పోరాటంపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సీ హోదా కోసం దళిత క్రైస్తవులు దశాబ్దాలుగా చేస్తున్న విజ్ఞప్తులకు ఈ తీర్పు ఒక ప్రధాన చట్టపరమైన అడ్డంకిగా మారనుంది. మరోవైపు, ఈ తీర్పు వల్ల ఇతర మతాల్లోకి మారిన వారు ఎస్సీ సర్టిఫికేట్లతో పొందుతున్న ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



.webp)


