మెడికల్ మాఫియాకు ముకుతాడు: కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీం.!
Published on: Thu Oct 29, 2026 2:38PM

దేశంలో ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మా సంస్థలు కలిసి సాగిస్తున్న ఔషధాల దందా, ధరల దోపిడీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, అత్యవసర ప్రాణ రక్షక మందులపై విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న తీరుపై సుప్రీం ధర్మాసనం అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులు, వైద్య సామాగ్రిపై ప్రైవేట్ ఆసుపత్రులు భారీ ఎత్తున లాభాలను గడిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధరల నియంత్రణ విధానాలపై ప్రశ్నలు సంధిస్తూ నిలదీసింది.
విచారణ సందర్భంగా ఒక నిర్దిష్టమైన ఉదాహరణను ప్రస్తావించిన సుప్రీం ధర్మాసనం.. మార్కెట్లో 1,100 రూపాయలకు అభ్యమయ్యే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి రోగికి ఏకంగా రూ.1.30 లక్షలకు విక్రయించిందని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మందుల కొనుగోలు ధరలకు మరియు ఆసుపత్రులు రోగులపై వేస్తున్న బిల్లులకు మధ్య ఇంతటి భారీ వ్యత్యాసం ఉండటం ఇసుమంతైనా సమర్థనీయం కాదని కుండబద్దలు కొట్టింది ఆరోగ్య రంగాన్ని లాభాపేక్షతో వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని, దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు కోల్పోయే దుస్థితి దాపురించిందని వ్యాఖ్యానించింది.

ఈ రకమైన విపరీతమైన దోపిడీ ధోరణులు రోగులను ఆర్థికంగా కుంగదీయడమే కాకుండా, వైద్య వృత్తి పవిత్రతనే మంటగలుపుతున్నాయని పేర్కొంది. నాన్ షెడ్యూల్డ్ ఔషధాల ధరల నియంత్రణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తప్పుపట్టింది. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ఆసుపత్రులు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది.
మెడికల్ మాఫియా కార్యకలాపాలు కేవలం మందుల దుకాణాలకే పరిమితం కాకుండా, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల నెట్వర్క్ల ద్వారా వ్యవస్థీకృత నేరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అనవసర వైద్య పరీక్షలు నిర్వహించడం, అధిక ధరలకే మందులు కొనుగోలు చేసేలా ఒత్తిడి చేయడం వంటి అనైతిక పద్ధతులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఫార్మా కంపెనీలు, ఆసుపత్రుల అనైతిక మార్కెటింగ్ పద్ధతులను అరికట్టేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది.
ఇలాంటి దోపిడీ ధోరణులకు అడ్డుకట్ట వేయకపోతే సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు.. ఔషధాల ధరల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని సూచించింది. పేదలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూసేందుకు చట్టపరమైన చర్యలు అవసరమని నొక్కిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణనువాయిదా వేస్తూ.. సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంకుశం వేసేలా అత్యున్నత న్యాయస్థానం తీసుకుంటున్న ఈ చర్యలు సామాన్యులకు ఊరటనిస్తాయని పరిశీలకులు అంటున్నారు.
[Supreme Court On Medicine Overpricing, Private Hospitals Markups, Medical Mafia, Cancer Drugs Pricing, Healthcare Pricing Regulation India, Telugu One]


