TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోర్టు తీర్పులపై విమర్శలు చేయవచ్చు కానీ..!

Published on: Tue Sep 15, 2026 9:53AM

సాధారణంగా కోర్టులు, కోర్టు తీర్పులపై విమర్శించాలన్నా, బాహాటంగా అసంతృప్తి, అసమ్మతిని వ్యక్తం చేయాలన్నా.. సామాన్యుల నుంచి మాన్యుల వరకూ, న్యాయవాదుల నుంచీ రాజకీయనాయకుల వరకూ అందరూ భయపడతారు. ఈ నేపథ్యంలోనే దేశంలో కోర్టులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన తీర్పులను విమర్శించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు కూడా సాధారణ మనుషులేననీ, వ్యవస్థపై విమర్శలు అవసరమే అయినప్పటికీ, మొత్తం వ్యవస్థే అవినీతిమయంగా మారిందని చెప్పడం సరికాదని సర్వోన్నత ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కోర్టుల తీర్పులను లేదా న్యాయ వ్యవస్థను విమర్శించాలంటే ప్రజలు, రాజకీయ నాయకులు భయపడేవారు. కోర్టు ధిక్కరణ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్  అవుతుందన్నదే ఆ భయం. అయితే కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారుతున్న కొద్దీ కోర్టు తీర్పులపై బహిరంగ చర్చలు, విమర్శలు   పెరిగాయి.

ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విమర్శల సరిహద్దులపై క్లారిటీ ఇచ్చింది.  న్యాయ వ్యవస్థలో తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం తప్పు కాదు కానీ, కానీ కోర్టులు పూర్తిగా అవినీతిమయమయ్యాయని భావి తరాలకు, విద్యార్థులకు బోధించడం  సరైనది కాదని ధర్మాసనం పేర్కొంది. జడ్జీలు ఎవరూ సాధువులు కారని, అయితే వ్యవస్థలోని లోపాలను, వ్యక్తుల తప్పులను వేరు వేరుగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.  

 ఒక వ్యవస్థలో లోపాలు ఉండవచ్చు, అది వివక్షపూరితంగా లేదా అసమానంగా అనిపించవచ్చు అంత మాత్రాన ఆ వ్యవస్థ మొత్తం'అవినీతిమయమైనది అని అనడం ఎంతమాత్రం సమజసం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అవినీతి అనేది పూర్తిగా వ్యక్తిగత లక్షణమే తప్ప వ్యవస్థది కాదని అంటున్నారు. కొంతమంది వ్యక్తుల తప్పులను మొత్తం వ్యవస్థకు ఆపాదించడం అనేది కేటగిరీ ఆఫ్ ఎర్రర్ కిందకు వస్తుందంటున్నారు. 

ఈ తరహా ఆలోచనా విధానాన్ని కేవలం న్యాయ వ్యవస్థకే కాకుండా పోలీస్ శాఖ సహా అన్ని  ప్రభుత్వ విభాగాలకూ వర్తిస్తుందని అంటున్నారు.   వ్యక్తుల తప్పులను బట్టి మొత్తం వ్యవస్థపై ముద్ర వేయకుండా నివారించడమే దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు సారాంశం అని చెప్పాలి. . వ్యవస్థలో ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దాలని కోరే హక్కు ఉంటుందే తప్ప.. మొత్తం వ్యవస్థ మూలాలను దెబ్బతినేలా  నిరాధార ఆరోపణలు చేయడం ఎంత మాత్రం సరికాదు.  

[Supreme Court on Corruption, CJI Surya Kant, Criticism of Judiciary,Supreme Court, Teluguone]