నిరసన స్థలాల జాబితా నుంచి జంతర్ మంతర్ తొలగింపు: కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు.!
Published on: Thu Oct 15, 2026 3:52PM

దేశ రాజధానిలో నిరసన గళం వినిపించాలంటే ఇక ఎక్కడికి వెళ్లాలి? ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదికగా నిలిచిన జంతర్ మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగిస్తే.. ప్రత్యామ్నాయంగా మరో మైదానాన్ని చూపిస్తే సరిపోతుందా? నిరసనకారుల గొంతు ప్రజలకు, పాలకులకు వినిపించే అవకాశం కూడా ఉండాలి కదా? ఈ ప్రశ్నల చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా గుర్తించే హోదాను తొలగించిన నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ చాలా కాలంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ సమస్యలపై పోరాడుతున్న వర్గాల నిరసనలకు వేదికగా ఉంది. అయితే, అక్టోబర్ 11న ఢిల్లీ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులతో జంతర్ మంతర్ కు ఇంత వరకూ నిరసన స్థలంగా ఉన్న హోదాను తొలగించారు. దాని స్థానంలో రాంలీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను నిరసనలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలుగా గుర్తించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది స్వాతి సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
స్వాతి సింగ్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జంతర్ మంతర్ హోదాను తొలగించాలనే నిర్ణయం సుప్రీంకోర్టు మౌఖిక వ్యాఖ్యల ఆధారంగా తీసుకున్నది కాదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యామ్నాయ నిరసన స్థలాలను పరిశీలించి నివేదిక సమర్పించిందని, ఆ సిఫారసుల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని వివరించింది.
.webp)
అయితే, ఒక నిరసన స్థలాన్ని తొలగించి మరికొన్ని ప్రదేశాలను ప్రత్యామ్నాయంగా చూపించినంత మాత్రాన సరిపోతుందా? అక్కడ నిరసనలు నిర్వహించేందుకు అవసరమైన స్పష్టమైన విధివిధానాలు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలు కూడా ఈ వివాదంలో కీలకంగా మారాయి. కొత్త ప్రదేశాల్లో నిరసనలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు తర్వాత జారీ చేస్తామని ఢిల్లీ పోలీసుల ఉత్తర్వులో పేర్కొనడంపై కూడా స్వాతీ సింగ్ తన పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం.. జంతర్ మంతర్‌ను తొలగించే ముందు సంబంధిత అధికారులు ఆ స్థలం వినియోగం, దాని అవసరం, ప్రభావంపై స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.
[Supreme Court Notices Delhi Police, Center, Jantar Mantar, Right To protest, right To Assemble, Democratic Rights, Swati Singh, Tushar Mehata, CJI, Surya Kanth]


