TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లలకు ఇంటర్నెట్ నిషేధం: రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం సంచలన తీర్పు.!

Published on: Sat Oct 17, 2026 3:06PM

దేశంలో పిల్లలకు ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, డిజిటల్ ప్రపంచాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడం వారి ప్రాథమిక హక్కు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు   సంచలన తీర్పు వెలువరించింది. పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే హక్కు వారికి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ సమాచారాన్ని పొందేందుకు ఉద్దేశించిన ఈ స్వేచ్ఛను ఆపడం వారి విజ్ఞాన సముపార్జనకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని విస్పష్టంగా పేర్కొంది. 

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు  రాజ్యాంగంలోని   నిబంధనలను ప్రస్తావించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ),  ఆర్టికల్ 19(1)(a) (వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ) కింద ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని తెలిపింది. ఈ రాజ్యాంగబద్ధమైన డిజిటల్ హక్కులు పెద్దలతో పాటు చిన్న పిల్లలకు కూడా సమానంగా వర్తిస్తాయనీ, వారిని ఆన్‌లైన్ ప్రపంచం నుంచి వేరు చేయడం సరైన విధానం కాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. 

ఆన్‌లైన్ వేదికలపై పిల్లల రక్షణ, వారి మానసిక ఆరోగ్యం మరియు భద్రత పట్ల ఆందోళనలు సమంజసమే అయినప్పటికీ, దానికి సంపూర్ణ నిషేధం ఒక్కటే పరిష్కారం కాదని స్పష్టం చేసింది. నిషేధాలు విధించడం వల్ల పిల్లల నేర్చుకునే తత్వం, నైపుణ్యాల పెంపొందించుకునే అవకాశం దెబ్బతింటుందనీ,  మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు విద్య, సమాచారం అందించడంలోనూ, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సామర్థ్యాలను మెరుగుపరచడంలోనూ ఇంటర్నెట్ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. 

పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించేందుకు నిషేధానికి బదులుగా సాంకేతిక పరిష్కారాలు,  కఠిన నిబంధనలు అమలు చేయాలని సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు  ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో తప్పనిసరిగా  చైల్డ్ మోడ్, పేరెంటింగ్ కంట్రోల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలనీ,  దీనిద్వారా పిల్లల సెర్చ్ హిస్టరీ, కాంటాక్ట్ సెట్టింగ్‌లు, యాక్సెస్‌ను తల్లిదండ్రులు పర్యవేక్షించే వీలుంటుందని పేర్కొంది.

దీనితో పాటు, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను తక్షణమే గుర్తించి డిజిటల్ వేదికల నుంచి తొలగించేందుకు సమర్థవంతమైన ఐటీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. హానికర కంటెంట్‌ను నిరోధించడంలో యాజమాన్యాలు విఫలమైనప్పుడు, ఆ భారాన్ని పిల్లల హక్కులను పరిమితం చేయడం ద్వారా వారిపై మోపడం ఎంతమాత్రం సరికాదని కోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం, ఐటీ విభాగాలు, సోషల్ మీడియా సంస్థలు,  తల్లిదండ్రులు సమన్వయంతో వ్యవహరించి పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించాలని న్యాయస్థానం సూచించింది.  

[Supreme Court ensational Verdict  internet Access Children, Ddigital Access, Mandatory Child Mode Social Media, Kids Internet Ban, Telugu One]