TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సర్ పూర్తయ్యే వరకూ స్థానిక ఎన్నికలు వాయిదా: వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.!

Published on: Fri Oct 9, 2026 12:23PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికలను వాయిదా వేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ   పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన  సుప్రీంకోర్టు  తోసిపుచ్చింది. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్దేశిత గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.   ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యేలోపు సర్ ప్రక్రియ పూర్తయితే, సవరించిన ఓటర్ల జాబితాను ఉపయోగించాలని పేర్కొంది. ఒకవేళ నోటిఫికేషన్‌ విడుదలయ్యే సమయానికి సర్ పూర్తికాకపోతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. 

అలాగే వార్డుల పునర్విభజనను అడ్డుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వార్డుల పునర్విభజనకు సంబంధించిన అభ్యంతరాలను కారణంగా చూపుతూ ఎన్నికలను అడ్డుకోవడం ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.  

సర్ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, వార్డుల పునర్విభజనకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌లో ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే అర్హులైన ఓటర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే సుప్రీం ఎన్నికల వాయిదాకు నో అంది.  

[Supreme Court Dismiss YCP Petition, AP Local Body Elections, Supreme Court, YCP Petition, State Election Commission, Andhra Pradesh Elections, Telugu One]