TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీంకోర్టుకు నిరసన ర్యాలీ: రాహుల్ గాంధీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఫైర్.!

Published on: Thu Oct 15, 2026 4:40PM

సుప్రీంకోర్టు ప్రాంగణానికి సమీపంలో ప్రతిపక్ష నాయకులు నిర్వహించిన నిరసన ప్రదర్శనపై అత్యున్నత న్యాయస్థానం  ఆగ్రహం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి నాయకులు సుప్రీంకోర్టు వైపు చేపట్టిన మార్చ్‌, ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఎవరూ కూడా న్యాయవ్యవస్థను భయపెట్టలేరని, బెదిరించలేరని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం   ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిరసనల పేరుతో రాజ్యాంగబద్ధ  వ్యవస్థలపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించడం ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టింది. 

ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయంటూ ఇండియా కూటమి నాయకులు, ప్రతిపక్ష ఆరోపిస్తున్న సంగతి విదితమే.. ఈ క్రమంలో ఈ నెల 12న రాహుల్ గాంధీ నాయకత్వంలో సుప్రీంకోర్టు దిశగా భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షించేందుకే తాము ఈ నిరసన చేపడుతున్నామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే..  సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న వ్యవహారంపై నేరుగా అత్యున్నత న్యాయస్థాన కాంప్లెక్స్ సమీపానికే పెద్దఎత్తున ప్రదర్శనగా రావడం   సరికాదని న్యాయ నిపుణులు,  ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు. .

ఈ పిటిషన్లపై గురువారం (అక్టోబర్ 15)సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ గౌరవ్ భాటియా ప్రతిపక్షాల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం పరిధిలోని అంశంపై ఇటువంటి రాజకీయ నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సరికాదని, కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. వీటికి స్పందించిన సుప్రీం రోర్టు  తదుపరి విచారణ సమయానికి అక్టోబర్ 12 నాటి నిరసన ప్రదర్శన మరియు తన ప్రవర్తనపై రాహుల్ గాంధీ పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము  ఐవరీ టవర్ కూర్చోవడం లేదని, సమాజంలో, దేశంలో ఏమి జరుగుతుందో ప్రతీ విషయాన్ని గమనిస్తున్నామని పేర్కొంది. న్యాయవ్యవస్థను ఎవరూ లొంగదీసుకోలేరని, ఇటువంటి  ప్రయత్నాలను కోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోదని కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో..  ఈ కేసులో ప్రతిపక్షాల పిటిషన్లను పరిశీలిం చడానికి నోటీసులు జారీ చేయడం అంటే వారి ప్రవర్తనను లేదా నిరసన పద్ధతిని మన్నించినట్లు కాదని క్లియర్ కట్ గా పేర్కొంది. 

ఎన్నికల సంఘం నిర్ణయాలను, ఓటర్ల జాబితా సవరణ విధానాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతుండగానే.. నిరసనలకు వేదికగా మారిన జంతర్ మంతర్ ధర్నా ప్రదేశం హోదా మార్పు,  ఢిల్లీ పోలీసుల వ్యవహారశైలిపై కూడా కోర్టు వివరణ కోరింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, న్యాయ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావు లేదని సుప్రీం ధర్మాసరం పేర్కొంది.  

 [Supreme Court Caution Rahul Gandhi, CJI Surya Kant Remarks, Rahul Gandhi Protest March, INDIA Bloc Petition, Telugu One]