TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

6 నెలల్లో 4.5 లక్షల మందికి మృత్యుగండం: మానవాళికి పెనుముప్పుగా సూపర్ ఎల్ నినో..!

Published on: Wed Sep 23, 2026 3:57PM

గ్లోబల్ వార్నింగ్ ముప్పు..రాబోయే ఆరు నెలల్లో భారీ ప్రాణనష్టం..!

ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు మానవాళిని తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి రాబోయే ఆరు నెలల కాలంలో ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగి, విపరీతమైన ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని ప్రముఖ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న పరిస్థితుల కారణంగా ఏర్పడుతున్న 'సూపర్ ఎల్ నినో' ప్రభావం రానున్న రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చనుంది. దీనివల్ల వచ్చే సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అదనంగా సుమారు 4,51,000 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ శాస్త్రవేత్తలు విడుదల చేసిన ఈ నివేదిక ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. గత మూడు దశాబ్దాల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే, ఈసారి ఏర్పడబోయే అదనపు ఉక్కబోత మరియు భీకర ఎండల వల్ల ఈ మరణాలు సంభవించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేశారు.ఈ విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలపై సమానంగా ఉండదని, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలు దీనివల్ల తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతంతో పాటు ఆగ్నేయాసియా దేశాలు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కేవలం ఆఫ్రికా  ఆసియా దేశాలకే పరిమితం కాకుండా భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా తీవ్ర వడగాల్పుల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. రానున్న కాలంలో వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఈ ఎల్ నినో తీవ్రత రాబోయే నెలల్లో శిఖరాగ్రానికి చేరుతుందని స్పష్టం చేసింది. డిసెంబర్ నాటికి ఇది మరింత బలపడే అవకాశం ఉండటంతో, దీని ప్రభావం సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పును ముందే గుర్తించి ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, శీతల కేంద్రాలను ఏర్పాటు చేయడం  బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక రక్షణ కల్పించడం ద్వారా ఈ ప్రాణనష్టాన్ని కొంతవరకు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

 

 

[ Super El Nino, Climate Change, Heat-related Deaths, Global South, Extreme Weather, Global Warming,Telugu One, Telugu News ]