TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముద్ద పెట్టని ముగ్గురు కొడుకులు: ఉండీ ఏం ఉపయోగం: వృద్ధ దంపతుల ఆత్మహత్య.!

Published on: Thu Oct 1, 2026 2:56PM

మూడు ముళ్లతో ఒక్కటై దశాబ్దాల పాటు ఒకరికి ఒకరు తోడుగా, నీడగా బతికారు. కష్టం, సుఖం చెరి సమానంగా, చెరి సగంగా పంచుకున్నారు. చావు బతుకులు తమను విడదీయలేవని నమ్మారు. కడుపున పుట్టిన పిల్లలు తమను వృద్ధాప్యంలో కను పాపల్లా చూసుకుంటారని ఆశించారు. అయితే ఆ వృద్ధ దంపతుల ఆశలు అడియాశలయ్యాయి. పిల్లల నిరాదరణ గుండెను తొలిచేసింది. శక్తి మేర పిల్లలను కంటి పాపల్లా చూసుకుని కాలు కిందపెడితే కందిపోతుందేమోనన్నంత అపురూపంగా చూసుకున్న వారు.. తమ చేతుల్లో పెరిగిన పిల్లల   నిరాదరణ తట్టుకోలేకపోయారు.  

అవమానాలు పడటం కంటే.. కలిసి తనువు చాలించడం మేలని నిర్ణయించుకున్నారు. ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.  హృదయాన్ని కదిలించివేసే ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెడితే..  

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా.కె గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి (88), అంజమ్మ (85) దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన వీరు.. తమకున్న వంశపారంపర్య ఆస్తితో పాటు కష్టపడి సంపాదించిన భూమిని కలిపి మొత్తం 25 ఎకరాలు, సొంత ఇంటిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇచ్చారు. ఆస్తి పంపకం చేసే వరకూ బాగా చూసుకున్న కుమారులు తరువాత నుంచీ తల్లిదండ్రుల పట్ల ఆదరణ చూపడం మానేశారు. 

ఆస్తులు తీసుకున్న కుమారులు తల్లిదండ్రుల బాగోగులు చూడాలన్న బాధ్యతను విస్మరించారు. తిన్నారా, బాగున్నారా అని కూడా అడగకుండా వదిలేశారు. దీంతో గత కొంత కాలం నుంచీ వాళ్లింటో, వీళ్లింట్లో ఉంటూ కాలం వెళ్ల దీస్తున్నారు.  అనారోగ్యం, పిల్లల నిరాదరణ ఇద్దరినీ కృంగదీసింది. ఒకప్పుడు వ్యవసాయం చేసుకుంటూ నలుగురికి భోజనం పెట్టి దర్జాగా గౌరవంగా బతికిన నర్సారెడ్డి, అంజమ్మ దంపతులు ఇప్పుడు ముద్ద కోసం మరొకరిపై ఆధారపడాల్సి రావడం తట్టుకోలేకపోయారు. 

మనసు చంపుకుని.. అవమానాన్ని పెదవి బిగింపులో దాచుకుని.. తాము పంచి ఇచ్చిన ఆస్తుల్లో కనీసం రెండెకరాలైనా తమకు ఇప్పించాలని పిల్లలను బతిమలాడుకున్నారు. వారి ససేమిరా అనడంతో గత్యంతరం లేక అధికారులను ఆశ్రయించారు. అక్కడా పరిష్కారం లభించకపోవడంతో  దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 

తమ వ్యవసాయ భూమిలోని బావిలో దూకి బుధవారం (సెప్టెంబర్ 30) ఆ వృద్ధ దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.  గురువారం (అక్టోబర్ 1) ఉదయం పొలానికి వెళ్లిన చిన్న కుమారుడు సంగారెడ్డి బావిలో తల్లి మృతదేహాన్ని గుర్తించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మనవడు మారుతిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


[Suicide, Elderly Couple, Sangareddy, Narayankhed, Sons Neglect, Trlangana News, Telugu One]