TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో పెరిగిన చక్కెర ధరలు.. కేంద్రం కీలక ప్రకటన..!

Published on: Fri Aug 21, 2026 8:42PM

 

దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు వేస్తూ చక్కెర ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. ఇథనాల్ తయారీ కోసం చక్కెరను మళ్లించడం వల్లే మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయంటూ వస్తున్న కథనాలను కేంద్ర ఆహార  ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

గత కొద్దిరోజులుగా బహిరంగ మార్కెట్లో చక్కెర ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. జూలై నెల మధ్యలో కిలో రూ. 48 వద్ద ఉన్న ధర, ఆగస్టు మూడో వారానికి రూ. 55 మార్కును దాటింది. ప్రస్తుతం ప్రధాన నగరాలలోని హోల్‌సేల్ విపణిలో కిలో ధర రూ. 65కు పైగా చేరగా, రిటైల్ షాపుల్లో ఏకంగా రూ. 70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ధరల భారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. చక్కెర లభ్యత తగ్గడానికి, రేట్లు పెరగడానికి ఉత్పత్తి అంచనాలు తలకిందులు కావడం, ప్రతికూల వాతావరణం వల్ల పంట నష్టపోవడమే ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు. దీనికి తోడు రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరగడం, కొందరు వ్యాపారుల అక్రమ నిల్వలు కూడా ఈ పరిస్థితికి దారితీశాయని వివరించారు.

ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరను ఎక్కువగా వాడటం వల్లే ఈ కొరత వచ్చిందన్న వాదనలో నిజం లేదని కేంద్రం గణాంకాలతో సహా నిరూపించింది. గతంలో ఇథనాల్ కోసం 12 శాతానికి పైగా చక్కెరను కేటాయించగా, ప్రస్తుత సంవత్సరంలో దాన్ని 9 శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో మెజారిటీ భాగం మొక్కజొన్న వంటి ధాన్యాల ఆధారంగానే వస్తోందని పేర్కొంది.

ధరల మంటను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. నిత్యావసర వస్తువుల లభ్యతను పెంచే దిశగా హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల దగ్గర ఉన్న చక్కెర నిల్వలపై కఠిన పరిమితులు (స్టాక్ లిమిట్స్) విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

దీనితో పాటు దేశీయంగా సరఫరాను తక్షణమే పునరుద్ధరించేందుకు గానూ అతి తక్కువ లేదా సున్నా శాతానికే దిగుమతి సుంకంతో విదేశాల నుంచి చక్కెరను దిగుమతి చేసుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లోని మార్పులను నిశితంగా పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థలో ఆటంకాలు లేకుండా చూస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ తక్షణ చర్యలు, దిగుమతుల నిర్ణయంతో రాబోయే రోజుల్లో మార్కెట్లోకి కొత్త నిల్వలు వచ్చి చేరతాయని నిపుణులు భావిస్తున్నారు. పండుగల సమయానికి చక్కెర లభ్యత పెరిగి, రీటైల్ ధరలు మళ్ళీ సాధారణ స్థాయికి దిగివస్తాయని సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు.

Sugar Prices Hike, Central Government Announcement, Ethanol Production, Food Ministry, Retail Sugar Rates, Sugar Imports, Telugu News