హర్మూజ్ లో నౌకపై దాడి: అందులో భారత సిబ్బంది..అందరూ క్షేమం.!
Published on: Sat Oct 31, 2026 8:51AM

హర్మూజ్ జల సంధిలో వాణిజ్య నౌకల రాకపోకల విషయంలో అగ్రరాజ్యాధినేత ఇస్తున్న హామీలు, భరోసాలూ ఒట్టిమాటలేనని తేలిపోయింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణీస్తున్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ లూయిస్1 అనే ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
ఓ చిన్న పడవలో వచ్చిన దుండగులు నౌకకు లింపెట్ మైన్స్ అంటించి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చిన్న పడవల ద్వారా నౌకల హల్కు అయస్కాంత శక్తితో అంటించే పేలుడు పదార్థాలనే లింపెట్ మైన్స్ అంటారు. అంతర్జాతీయ ఆంక్షలు, రవాణా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ దాడిలో నౌకలోని ఇంజిన్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, నావిగేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. నౌకలో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే పర్యావరణానికి ఎటువంటి హానీ జరగలేదు. కాగా దాడికి గురైన నౌకలో 27 మంది ఇండియన్ నావికలు ఉన్నారు.
ఈ దాడిని భారత నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఖండించారు. దెబ్బతిన్న ఎంటీ లూయిస్-1 నౌకలో మొత్తం 27 మంది భారత సిబ్బంది ఉన్నారని, వారందరూ పూర్తిగా సురక్షితంగా స్పష్టం చేశారు. అలాగే, దీనికి కేవలం ఒక్క రోజు ముందు ఇదే జలసంధి ప్రాంతంలో ఎంటీ అర్జానా అనే మరో నౌకపై కూడా దాడి జరిగింది. అందులో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఈ రెండు సంఘటనల్లోనూ కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కేంద్ర ప్రభుత్వం సంబంధిత షిప్ మేనేజ్మెంట్ కంపెనీలు, రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
[Strait of Hormuz Tension Attack, Oil Tanker, Indian Crew Safe, Oman coast Maritime Security, Telugu One]


