నావల్ మైన్ను ఢీకొట్టి మునిగిపోయిన కార్గో నౌక.. హర్ముజ్ జలసంధిలో ఘోర ప్రమాదం.!
Published on: Thu Oct 15, 2026 4:22PM

హర్మూజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలియజేసే ఉదంతమింది. హోర్ముజ్ జలసంధిలో నావల్ మైన్ ను ఢీకొని ఓ భారీ వాణిజ్య నౌక మునిగిపోయింది. దాదాపు పాతిక వందలకు పైగా కంటైనర్లను రవాణా చేస్తున్న ఒక భారీ కార్గో నౌక, సముద్రంలో ఏర్పాటు చేసిన నావల్ మైన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ తరువాత ఆ భారీ వాణిజ్య నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ధృవీకరించింది.
ఇరాన్ అధికారిక మీడియా నౌక ప్రమాద దృశ్యాలను ప్రసారం చేశాయి. సముద్రంలో ఒక వైపునకు వంగిపోయి, దట్టమైన నల్లటి పొగలు కమ్ముకుంటున్న కంటైనర్ నౌకకు సంబంధించిన దృశ్యాలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. నౌక నుంచి పడిపోయిన అనేక కంటైనర్లు సముద్రంలో తేలుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఒక నౌక నావల్ మైన్ను ఢీకొని సముద్రంలో మునిగిపోవడం ఇదే తొలిసారి కావడంతో రవాణా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే.. ఈ నౌక ఎలాంటి అనుమతులు లేకుండా.. అనధికారిక సముద్ర మార్గంలో ప్రయాణిస్తోందని ఇరాన్ సైనిక వర్గాలు ఆరోపించాయి. నిబంధనలను ఉల్లంఘించి ముందుకు సాగడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని ఇరాన్ పేర్కొంది. గత కొంతకాలంగా అనుమతి లేని నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించరాదని ఇరాన్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూ వస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదానికి గురైన నౌకకు సంబంధించిన సిబ్బంది వివరాలు, క్షేమ సమాచారంపై క్లారిటీ లేదు.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి ప్రాంతంలో భద్రతా పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. గతంలో పలుమార్లు వివిధ దేశాల నౌకలపై అనుమానాస్పద దాడులు జరగడం, ఇప్పుడు ఏకంగా నావల్ మైన్ పేలి కార్గో నౌక జలసమాధి కావడం అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ ఘటన పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
[Strait of Hormuz Iran Naval Mine Incident, Cargo Ship Sink, International Maritime Routes, West Asia War Developments, Telugu One]


