కడుపునొప్పి, గ్యాస్ సమస్య వేధిస్తోందా.. అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కా మ్యాజిక్ చేస్తుంది..!
Published on: Tue Aug 25, 2026 6:01PM

మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా. అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే..
కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్..
కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి గోరువెచ్చని కాపడాలు చాలా బాగా సహాయపడతాయి.
అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే.. ఆ కడుపు నొప్పి కూడా వాంతులు, జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..
ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి.
పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను అలాగే పెట్టుకుని పడుకోకూడదు.
ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి.
కఫ సమస్యలకు ఉప్పు కాపడం..
దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.
వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.
*రూపశ్రీ.


