స్టార్ లింక్ ఇండియా ఎంట్రీలో జాప్యం: మస్క్ ఆరోపణలు, కేంద్రం ఖండనలు.. అసలు వాస్తవం ఏంటి.?
Published on: Fri Oct 9, 2026 4:23PM

ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో మాత్రం ఇంకా వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించలేదు. అవసరమైన కొన్ని కీలక అనుమతులు పొందినప్పటికీ, తుది భద్రతా పరిశీలనలు, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఆలస్యంపై మస్క్‌లో సహజంగానే అసంతృప్తి, అసహనం వ్యక్తమౌతున్నాయి. వాటిని ఆయన సెన్సేషనలైజ్ చేసే విధంగా వ్యూహాత్మకంగా వ్యక్తం చేశారు. భారత్‌లోని కొందరు ప్రభావశీల వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ పారదర్శకంగా, అన్ని సంస్థలకు ఒకే విధంగా కొనసాగుతోందని విస్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.
స్టార్‌లింక్ సేవలు ఇండియాలో ప్రవేశంలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విస్తృత చర్చకు దారి తీశాయి. . భారత్‌లో కొందరు సంపన్న వ్యాపారవేత్తలు తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న ఆయన అక్కడితో ఆగకుండా.. ముఖేష్ అంబానీ ప్రభావం, ప్రమేయాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రాన్ని ఆయన తన గుప్పిట పెట్టుకుని షాడో గవర్నమెంట్ గా వ్యవహరిస్తున్నారన్న అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

ఆ వెంటనే కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఇండియాలో ప్రవేశానికి స్వాగతం పలుకుతున్నామని ప్రకటించి.. ఆయన మరో వ్యక్తి గురించి తెలసుకున్నా తరువాత పరిస్థితి మరింత అవగాహనకు వస్తుందంటూ వ్యంగ్య వాఖ్యలను జోడించారు. రాహుల్ వ్యాఖ్యలతో స్టార్‌లింక్ అనుమతుల వ్యవహారం కేవలం సాంకేతిక అంశంగా ఉన్నది కాస్తా, వ్యాపార పోటీ, రాజకీయ ప్రమేయం అన్న చర్చకు కేంద్ర బిందువుగా మారిపోయింది. అది పక్కన పెడితే.. ఎలాన్ మస్క్ ఆరోపించినట్లుగా గుత్తాధిపత్యం, షాడో గవర్నమెంట్ అన్న అంశాలను నిరూపించే ఆధారాలేవీ కనిపించడం లేదు. లేదా మస్క్ వెల్లడించలేదు.
అన్నిటికీ మించి స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ శాఖ నుంచి జీఎంపీసీఎస్ ఆపరేటర్ లైసెన్స్, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక, అధికార సంస్థ (ఇన్ స్పేస్) నుంచి అవసరమైన అనుమతులు స్టార్ లింక్ పొందింది. దేశంలో కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేసింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.
అయితే ఇవి దేశంలో వాణిజ్య సేవలు ప్రారంభించడానికి సరిపోవు. భద్రతా ప్రమాణాలు, స్పెక్ట్రమ్ కేటాయింపు, దేశీయ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక వ్యవస్థల ఏర్పాటు వంటి ప్రక్రియలు పూర్తవ్వాల్సి ఉంది.
ఆ విషయంలో ఇంకా అడుగు ముందుకు పడకపోవడానికి భద్రతాపరమైన అంశాలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల్లో వినియోగదారుల డేటా ఏ మార్గంలో ప్రయాణిస్తోంది, దాన్ని భారత అధికారులు అవసరమైనప్పుడు పర్యవేక్షించగలరా అనే కీలక అంశాల విషయంలో ఇప్పుడు పరిశీలనలు జరుగుతున్నాయి. చట్టబద్ధమైన నిఘా అవసరాలకు సహకరించడం, డేటా స్థానికీకరణ నిబంధనలను పాటించడం, అత్యవసర పరిస్థితుల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సేవలను నిలిపివేయగలగడం వంటి షరతులను ఉపగ్రహ సేవల సంస్థలు పాటించాల్సి ఉంటుంది.
స్టార్‌లింక్ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉపగ్రహ వ్యవస్థపై ఆధారపడుతుంది. ఉపగ్రహాల మధ్య లేజర్ లింకుల ద్వారా డేటా ప్రయాణించే విధానం వల్ల భారత వినియోగదారుల ట్రాఫిక్ దేశీయ గేట్‌వేల ద్వారానే వెళ్లేలా నియంత్రించడం ఎలా అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అందువల్ల భద్రతా పరీక్షలు, సాంకేతిక అనుసరణలు పూర్తి చేయడం కోసమే తుది స్టార్ లింక్ కు తుది అనుమతులకు ఇంకా లభించలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్టార్‌లింక్ విషయంలో వివక్ష చూపుతున్నారన్న మస్క్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. స్టార్‌లింక్‌తో పాటు జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ మద్దతున్న యూటెల్‌సాట్ వన్‌వెబ్ సంస్థలూ అవసరమైన భద్రతా పరిశీలనలను ఎదుర్కొంటున్నాయని స్పష్టం చేసింది. అన్ని సంస్థలకూ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, భద్రతా అనుమతులు పూర్తయ్యే వరకూ వాణిజ్య సేవలకు తుది అనుమతి ఇవ్వలేమని, ఇవ్వబోమనీ కేంద్రం కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో ఏ సంస్థకూ గుత్తాధిపత్యం ఉండేలా ప్రభుత్వం వ్యవహరించదని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. స్టార్‌లింక్ ఒక్కటే కాకుండా, శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పనిచేయాలనుకుంటున్న ఇతర సంస్థలూ నిర్దేశిత నిబంధనలను పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతోంది.
[Starlink India Entry Delay, Elon Musk, Mukesh Ambani, Reliance Jio, Satellite Internet, Central Government, Security Clearances, Rahul Gandhi, Telugu One]


