TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దశేష వాహనంపై శ్రీవారు.. తిలకించి పులకించిన భక్తకోటి.!

Published on: Wed Sep 16, 2026 11:50AM

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో మంగళవారం (సెప్టెంబర్ 15) వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.శ్రీవారి పెద్ద శేష వాహన సేవ తిలకించి భక్త కోటి పులకించింది. శ్రీవారి పెద్దశేష వాహనసేవను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 దేశంలోని భిన్న ప్రాంతాల కళా, సాంస్కృతిక వైభవాన్ని తిరుమలలో ఆవిష్కరిస్తూ 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలకు చెందిన 549 మంది కళాకారులు  నృత్యాలు, జానపద కళలు, సంగీత ప్రదర్శనలతో తిరుమలను కళా వైభవానికి వేదికగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేసింది. 

తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు, పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు.  రంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం  భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది.

తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన శ్రీమద్రామాయణ రూపకం భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు. వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోని  భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి.

[Srivari Brahmotsavalu, Pedda Sehavahanaseva, Cultural, Programmes, TTD]