భారీ వర్షాల ఎఫెక్ట్: పొంగిపొర్లుతున్న వంశధారా, నాగవళి.!
Published on: Fri Sep 25, 2026 12:16PM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన రహదారులన్నీ జలయమయ్యాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి, వంశధార, బాహుద నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు జలయమయ్యాయి. వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నాగావళి నదికి భారీ వరద ప్రవాహం పోటెత్తడంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సమానంగా 59,700 క్యూసెక్కులుగా నమోదైంది. మరోవైపు వంశధార నదికి 41,425 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు దిగువకు 42,926 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు బాహుద నది సైతం 34,656 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో ప్రమాదకర స్థాయికి చేరువలో పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి వదులుతున్నారు.

వరద ఉదృతి అంతకంతూ పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు వేగవంతం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాయి. అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు నిరంతరం సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల వసతులను సిద్ధం చేసిందని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. నదుల నీటిమట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వర్షాల తీవ్రత మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
[Srikakulam Floods, Srikakulam Rivers, Nagavali, Vamsadhara, Hheavy Rains, AP News, Telugu One]


