TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌లో స్ప్లాష్‌బీఐ గ్లోబల్ సెంటర్ ప్రారంభం..!

Published on: Mon Nov 9, 2026 2:59PM

275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ చేరింది. డేటా ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న అమెరికాకు చెందిన స్ప్లాష్‌బీఐ సంస్థ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఐటీ, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ తనదైన గుర్తింపును మరింత బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 515కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు పనిచేస్తున్నారని వెల్లడించారు. గత ఏడాది దేశంలో అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని తెలిపారు. 

వచ్చే ఏడాదిలో మరో 100 జీసీసీలను నగరానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.జీసీసీలను కేవలం సేవలందించే కేంద్రాలుగా కాకుండా.. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధి, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. 

ముఖ్యంగా ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్‌ను మరింత కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా పనిచేస్తున్న స్ప్లాష్‌బీఐ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్‌ప్రైజ్ సంస్థలకు తన సేవలను అందిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు. 

సంస్థ రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని వెల్లడించారు. నగర కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్ప్లాష్ ఏఐ సామర్థ్యాలను కూడా మరింత విస్తరించనుందని చెప్పారు.

ఈ కేంద్రం ద్వారా స్థానికంగా 275 మంది నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ సాంకేతిక కార్యకలాపాలను విస్తరించడం రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊతమిస్తుందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
 

 

 

[ SplashBI Global Center, Hyderabad GCC, Global Capability Centre, Telangana IT Sector, Duddilla Sridhar Babu, Artificial Intelligence, AI, Data Intelligence, Business Analytics, Data Analytics, Splash AI, Gachibowli Financial District, US Technology Company, Global IT Investments, $100 Million Investment, IT Jobs in Hyderabad, 275 Job Opportunities, Technology Innovation, Cyber Security, Product Engineering, Hyderabad IT Hub, Telangana IT Investments ]