TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైకుంఠాపురం బ్యారేజీ పనులు పట్టాలెక్కేదెన్నడు?

Published on: Fri Aug 28, 2026 1:12PM

నవ్యాంధ్రప్రదేశ్   రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధికి కీలకమైన వైకుంఠపురం, దాములూరు బ్యారేజ్ పనులు నిలిచిపోవడంపై  నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాజధాని ప్రాంతంలో తాగునీటి ఎద్దడి నివారణతో పాటు  ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని మెట్ట   రైతులకు ప్రాణధారగా నిలిచే ఈ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చూపిం చాల్సినంత శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయం వారిలో వ్యక్తమౌతోంది.

2014, 19 మధ్యకాలంలో అప్పటి సీఎం  నారా చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ గా ఊపిరి పోసుకున్న ఈ ప్రాజెక్టుకు  2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టుపై శీతకన్నేసింది. దీంతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా మూలన పడ్డాయి.  

ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతికి 62 కిలోమీటర్ల మేర వాటర్ ఫ్రంట్ ఏర్పడుతుంది.  ఇది రాజధాని నగర సౌందర్యానికే కాకుండా పర్యాటకానికి కూడా జోష్ ఇస్తుంది.  కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ ఎగువన నిర్మించే  వైకుంఠాపురం, దాములూరు బ్యారెజ్  ద్వారా   10 టీఎంసీల వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల అమరావతికి నిరంతర   జల సరఫరా సాధ్యమవుతుంది.  అలాగే ఈ ప్రాంతంలో  ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటున్నారు నిపుణులు. 

జగన్ హయాంలో నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలు, అశాస్త్రీయ  డ్రెడ్జింగ్ వల్ల కృష్ణా ప్రవాహం కుడివైపునకు మళ్లి, తీరప్రాంతంలోని 52 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఇందువల్ల  70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయారు.     ఈ సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారం వైకుంఠాపురం, దాములూరు ప్రాజెక్టును పూర్తి చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.  4 వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదించిన ఈ బ్యారేజీని కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ నిధులతో లేదా సీఆర్డీఏ గ్రాంట్ల ద్వారా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయనీ, ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుని సత్వరమే ఈ బ్యారేజీ పనులను పట్టాలెక్కించాలని ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం కోరుతున్నారు.  

Speedup Vaikuntapuram Barrage Works, Capital  Amaravati  Water Supply, AP Irrigation Project,  Krishna River Vaikuntapuram Damaluru Barrage, Telugu One