TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంతరిక్షంలో అమెరికా ఆయుధాలు.!

Published on: Tue Sep 15, 2026 10:51AM

అంతరిక్షంలోనూ అమెరికా ఆయుధాగారాలు ఉన్నాయా? భూమి, సముద్రం, ఆకాశం.. ఇలా ఏవీ అమెరికా యుద్ధ ఉన్మాద వ్యాప్తికి అతీతం కాదా, అంటే అమెరికా తాజాగా చేసిన ప్రకటనను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. అమెరికా తమ ఆయుధాలు అంతరిక్ష కక్ష్యలోనూ ఉన్నట్ుల స్వయంగా ప్రకటించింది.  ఇంత కాలం   గోప్యంగా ఉంచిన ఈ వ్యూహాత్మక అంశాన్ని ఆ దేశ స్పేస్‌ ఫోర్స్‌ అత్యున్నత స్థాయి సదస్సులో వెల్లడించింది. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టేందుకు ఆయుధాలను కక్ష్యలో మోహరంచినట్లు అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.  

మేరీల్యాండ్‌లో జరిగిన   సదస్సులో అమెరికా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మీంక్..  మారుతున్న కాలానికి అనుగుణంగా అంతరిక్ష రంగంలోనూ ముప్పులు పెరుగుతున్నాయనీ..  వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా సర్వసన్నద్ధంగా ఉందనీ పేర్కొన్నారు. వ్యూహాత్మక నిరోధక శక్తిని పెంచుకోవడంలో భాగంగానే ఈ స్పేస్‌ కంట్రోల్ ఆయుధాలను అందుబాటులోకి తెచ్చినట్లు   వెల్లడించారు.

శత్రు దేశాల నుంచి జాయింట్ ఫోర్స్‌కు ఏ క్షణంలోనైనా ముప్పు వాటిల్లే అవకాశం ఉండటంతో, దాన్ని అడ్డుకోవడానికి అంతరిక్ష కక్ష్యలోని ఆయుధాలు   సమర్థవంతంగా పని చేస్తాయన్నారు. అయితే..  ఈ ఆయుధాల సాంకేతిక వివరాలు,  వాటి సామర్థ్యం, అలాగే వాటిని  ఎప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టారనే అంశాలపై మాత్రం  స్పష్టతనివ్వలేదు. కేవలం భద్రతా ప్రయోజనాల దృష్ట్యానే ఈ ప్రకటన చేసినట్లు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, చైనా దేశాలు అంతరిక్షంలో తమ సైనిక కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను దెబ్బతీసేందుకు ఆ దేశాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమెరికా సైతం తన ఉపగ్రహాలను రక్షించుకోవడంతో పాటు, ప్రత్యర్థుల కదలికలను నిలువరించేందుకు ఈ తరహా రక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

అంతరిక్షంలో సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపును నిషేధిస్తూ 1967 నాటి అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నప్పటికీ, ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే ఎలక్ట్రానిక్ లేదా ఇతర స్పేస్‌ కంట్రోల్ పరికరాలను ఈ ఒప్పందాల పరిధిలోకి పూర్తిగా తీసుకురాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలతో భవిష్యత్తులో అంతరిక్షం సైతం సైనిక పోటీకి   వేదికగా మారే ముప్పు ఉందని స్పష్టమౌతోంది. US Weapons in Space

[Space Force Orbital Weapons, Trojan Main Announcement, US Space Weapons, Space Control Weapons, TeluguOne]