నైరుతి గుడ్ బై చెప్పేసింది: లోటు వర్షపాతమే కానీ.!
Published on: Sat Sep 26, 2026 10:32AM

నైరుతి రుతుపవనాలు గుడ్ బై చెప్పేశాయి . ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. సీజన్ చివరి రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసి కొంత మేరకు ఉపశమనం కలిగించాయి గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా వర్షపాతం లోటు ఒకింత తగ్గింది. సీజన్ మొత్తం మీద గతంలో 20 శాతంగా ఉన్న లోటు, ఈ తాజా వర్షాల కారణంగా 15 శాతానికి చేరింది. సెప్టెంబర్ 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఏకంగా 34 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత నాలుగు రోజుల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ నెల లోటు 4 శాతానికి పడిపోయింది. ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో సగటున 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అదలా ఉంటే.. గత నాలుగు రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 25) సాయంత్రానికి 20.2 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం, శనివారం (సెప్టెంబర్ 26) ఉదయానికి 30 అడుగులకు చేరకుంది. అలాగే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో అధికారులు 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు, భూపాలపల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షపు నీరు భూగర్భ గనుల్లోకి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో, శనివారం (సెప్టెంబర్ 26) నుంచి రాష్ట్రంలో మళ్లీ ఉక్కపోతతో కూడిన వాతావరణం మొదలైంది.
[Southwest Monsoon, Telangana Rains, Rainfall Deficit, Bhadrachalam Godavari, Talipet Project, Telangana Weather, Telugu One]


