పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్టులో సోనియా పేరు? కోర్టులో మళ్లీ విచారణ..!
Published on: Mon Sep 21, 2026 6:59PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ జాబితా వివాదంలో ఢిల్లీ కోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది. ఆమె భారతీయ పౌరసత్వం పొందడానికి ముందే ఓటర్ జాబితాలో పేరు చేర్చారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, దాన్ని ఢిల్లీలోని ద్వాకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తోసిపుచ్చారు. పాత మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైన కారణాలు లేనివని అవి 'నాన్-స్పీకింగ్ ఆర్డర్' అని స్పష్టం చేస్తూ ఆ తీర్పును పక్కన పెట్టారు. ఈ కేసుకు సంబంధించి తగిన విచారణ జరిపి, పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని, ఇరుపార్టీల వాదనలు విన్న తర్వాతే కొత్తగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 29వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

ఈ మొత్తం వివాదం వెనుక దరఖాస్తుదారు వికాస్ త్రిపాఠి అనే న్యాయవాది ఉన్నారు. సెంట్రల్ ఢిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న వికాస్ త్రిపాఠి ఈ రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన వాదన ప్రకారం, సోనియా గాంధీ ఏప్రిల్ 30, 1983 వ సంవత్సరంలో అధికారికంగా భారతీయ పౌరసత్వాన్ని పొందారు. అయితే, ఆమె పౌరసత్వం పొందడానికి సరిగ్గా మూడు సంవత్సరాల ముందు అనగా 1980వ సంవత్సరంలోనే న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాలో ఆమె పేరు చేర్చబడిందని ఆరోపించారు. అంతేకాకుండా, 1982లో ఆ పేరు తొలగించబడి, మళ్లీ 1983లో తిరిగి చేర్చబడిందని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించి ఈ అక్రమాలకు పాల్పడ్డారని, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని ఆయన కోరారు.
మరోవైపు, సోనియా గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.ఎస్. చీమా వాదనలు వినిపిస్తూ ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. ఈ పిటిషన్ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, నిరాధారమైనదని మరియు చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఎలాంటి ప్రాథమిక పత్రాలు లేదా ఆధారాలు చూపకుండా, కేవలం మీడియాలో వచ్చిన ఊహాజనిత కథనాల ఆధారంగా ఈ ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు.
.webp)
పౌరసత్వానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, ఓటర్ జాబితా వివాపాలు ఎన్నికల సంఘం పరిధికి చెందుతాయని గతంలో మెజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయితే, నేరం జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు జరపకుండా పౌరసత్వం వైపు మళ్లడం సరికాదని తాజా తీర్పులో ప్రత్యేక న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 175(3) నిబంధనలను పాటించకుండా మెజిస్ట్రేట్ కోర్టు గతంలో ఏకపక్షంగా వ్యవహరించిందని కోర్టు తప్పుపట్టింది. సెప్టెంబర్ 29న జరగనున్న విచారణలో ఈ వివాదంపై ఎలాంటి కొత్త మలుపులు వస్తాయోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
[ Sonia Gandhi, Voter roll case, Delhi court, Citizenship controversy, fresh hearing, Legal news, Rahul gandhi, Congress party, BJP, R.S. Cheema, Telugu One, Telugu News ]


