TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావ్: తాళ్ల రాంపూర్ లో లో పెత్తందారీ పోకడలు.!

Published on: Mon Oct 12, 2026 10:24AM

గ్రామాల్లో అభివృద్ధి జరగాలి. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి. గ్రామ సమస్యలను గ్రామస్థులే పరిష్కరించుకోవాలి. ఇదే స్థానిక స్వపరిపాలన లక్ష్యం. గ్రామ స్వరాజ్యంతోనే నిజమైన స్వరాజ్యం సిద్ధించినట్లు. అయితే దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 

ముఖ్యంగా దశాబ్దాల పాటు దొరల పెత్తనం కింద నలిగిపోయి.. సాయుధ పోరాటం చైతన్యంతో దొరల గడీల పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణలోని పలు ప్రాంతాలలో మళ్లీ పెత్తందారీ పోకడలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా  నిజామాబాద్ ప్రాంతంలో గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట కొందరు సాగిస్తున్న పెత్తందారీ తనం   ప్రజాస్వామ్యం, కుల సమానత్వం, రాజ్యాంగ హక్కులనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.   యెర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో  గీత కార్మికుల హక్కుల విషయంలో   మొదలైన వివాదం.. గౌడ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల సామాజిక బహిష్కరణకు దారితీసింది. 

తాళ్లరాంపూర్‌లో సుమారు 39 గౌడ కుటుంబాలు, 10 ఎస్సీ కుటుంబాలు సామాజిక బహిష్కరణకు గురయ్యాయి.  ఆ కుటుంబాలతో  మాట్లాడినా, వారికి వస్తువులు విక్రయించినా, సహాయం చేసినా పాతికవేల రూపాయలు జరిమానా అంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇది ఆ బహిష్కరణకు గురైన కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడంతో పాటి ఆ కుటుంబాలను   సామాజికంగా ఏకాకులను చేసింది. 

 బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  తెలంగాణ  బీసీ  కమిషన్ కూడా ఈ సమస్యను పరిశీలించేందుకు, పరిష్కరించేందుకు తాళ్ల రాంపూర్ గ్రామానికి వెళ్లింది.  సామాజిక బహిష్కరణపై   దర్యాప్తు మొదలైంది. 

 అదలా ఉంచితే.. అసలు  గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదుకానీ,  అలాంటి కమిటీలకు ప్రజల వ్యక్తిగత జీవితాలపై ఆంక్షలు విధించే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందన్నదే ప్రశ్న? ఎవరితో మాట్లాడాలి, ఎవరి దుకాణంలో వస్తువులు కొనాలి, ఎవరికి సహాయం చేయాలి అనే విషయాలను, ఎవరిని బహిష్కరించాలి అన్న విషయాలను నిర్దేశించే హక్కు కమిటీలకు ఎక్కడిదని బాధిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. 

గ్రామాల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీలు, చట్టబద్ధమైన పరిపాలనా వ్యవస్థలు ఉన్నప్పుడు.. వాటికి సమాంతరంగా పనిచేస్తూ జరిమానాలు విధించడం, సామాజిక బహిష్కరణలు చేయడం  వంటి చర్యలు ప్రజాస్వామ్యం ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి. అలా కాకుండా  మెజారిటీ వర్గం అభిప్రాయం పేరుతో ఇతర వర్గాలపై నిర్ణయాలను బలవంతంగా రుద్దడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం అనిపించుకోదు.   తాళ్లరాంపూర్  ఘటనలో వీడీసీల వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగి, దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

[Social Boycott Thallarampur,  Nizamabad village, VDC dispute, Thallarampur Incident, caste Discrimination, Goud Families, Telangana BC Commission,   Constitutional Rights, Telugu One]