TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ను బతికించిందెవరంటే: ఆ విమానంలో ఉన్న డెంటిస్ట్ డాక్టర్.!

Published on: Thu Oct 8, 2026 9:12AM

ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన దాడి ఘటనలో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలతో బయటపడటం వెనుక మరో వ్యక్తి శ్రమ, సాహసం, తపన ఉంది. ఆ వ్యక్తి  ఆ విమానంలోనే   ఉన్న డెంటిస్ట్ డాక్టర్ షోటా ముసాయెవ్. దాదాపు  45 నిమిషాల పాటు స్మిత్ మచ్చర్ కు అత్యవసర వైద్యం అందిస్తూ ఆయనను స్పృహలో  ఉంచారు. తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్ స్ఫృహ కోల్పోకుండా ఉంచేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరకు స్మిత్ మచ్చర్ ను స్ఫృహ కోల్పోకుండా ఉంచడంలో విజయం సాధించారు. 

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్  విమానంలో కో-పైలట్ దాడిలో స్మిత్ మచ్చర్ తలకు, ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. విపరీతంగా రక్తస్రావవం అయ్యింది.   ఘటన సమయంలో అరుపులు వినిపించడంతో ప్రయాణికులు కాక్‌పిట్ వైపు పరుగెత్తారు. వారిలో డాక్టర్ ముసాయెవ్ కూడా ఉన్నారు.

ముసాయెవ్ ముందుగా దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ఇతర ప్రయాణికులతో కలిసి సహకరించారు. అనంతరం నేలపై రక్తపు మడుగులో పడి ఉన్న   కెప్టెన్ స్మిత్ మచ్చర్  వద్దకు చేరుకుని,  విమానంలో అందుబాటులో ఉన్న టీషర్ట్ లను గాయాలపై గట్టిగా ఉంచి రక్తస్రావాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రక్తం ఆగకపోవడంతో సిబ్బందిని ఐస్ ప్యాక్స్ తీసుకురావాలని కోరారు.

గాయాలను పరిశీలించేందుకు టీషర్ట్‌ను తొలగించిన ప్రతిసారీ రక్తస్రావం మరింత పెరిగింది. దీంతో ముసాయెవ్ గాయాలపై ఒత్తిడిని కొనసాగిస్తూ ఐస్‌ను ఉపయోగించారు. ఇలా దాదాపు 45 నిమిషాల పాటు   పైలట్ పరిస్థితిని గమనిస్తూ ఆయన స్ఫృహ కోల్పోకుండా ఉంచారు.

ఒక దశలో స్మిత్ మచ్చర్  పల్స్ డౌన్ అయ్యింది.  ఆ సమయంలో పల్స్ రేట్ పెంచడానికి ముసాయెవ్ స్మిత్ మచ్చర్ రెండు కాళ్లనూ పైకెత్తి పట్టుకున్నారు. అప్పుడు పల్స్ రేట్ సాధారణ స్థితికి వచ్చింది.  ఆ తరువాత కొద్ది సేపటికే స్మిత్ మచ్చర్ పరిస్థితి విషమించింది. పెదాలు నీలి రంగులోకి మారిపోయాయి.  పరిస్థితి అదుపుత తప్పుతోందని గుర్తించిన  ముసాయెవ్ విమానాన్నిత్వరగా ల్యాండ్ చేయాలని సిబ్బందిని కోరారు. అక్కడితో ఆగకుండా.. స్మిత్ మచ్చర్ ను కుదుపుతూ.. నిద్రపోవద్దు.. మీ అవసరం మాకు ఉంది అంటూ చెప్పారు. క్షణం గ్యాప్ ఇవ్వకుండా స్మిత్ మచ్చర్ తో మాట్లాడుతూనే ఉన్నారు. స్మిత్ మచ్చర్ భార్యా బిడ్డల గురించీ, కుటుంబ సభ్యుల గురించీ మట్లాడుతూ ధైర్యం చెబుతూనే ఉన్నారు.  

చివరకు విమానం సౌదీ అరేబియాలోని తబూక్‌లో సురక్షితంగా ల్యాండ్ కావడంతో మచ్చార్‌కు తదుపరి వైద్యం అందింది. అనంతరం ఆయనను యూఏఈకి తరలించారు. అక్కడ అందిన చికిత్సతో స్మిత్ మచ్చర్ కోలుకున్నారు. అయితే ప్రాథమికంగా స్మిత్ మచ్చర్ ను కాపాడి, ఆయనకు కీలక సమయంలో అత్యవసర వైద్యం అందించడమే కాకుండా, 45 నిముషాల పాటు ఆయన మగతలోకి వెళ్లకుండా నిరంతరం ధైర్యం చెబుతూ మాట్లాడుతూ బతికించిన  డాక్టర్ ముసాయెవ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

 

[Smit Machchhar, Flydubai Flight, Flydubai Attack, Dentist Doctor Shota Musaev, Indian Pilot,Telugu One]