TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారా ఇదెంత చెడ్డ అలవాటో తెలుసా.!

Published on: Wed Sep 23, 2026 9:50AM

రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.

దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే..

మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది.

స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి.

ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి.

ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు:

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది.

అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి.

నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది.

ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల 

ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.

                    *రూపశ్రీ.