వెండి తెర ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్: సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.!
Published on: Sun Oct 4, 2026 7:25AM
.webp)
భారత చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు, వినూత్న ప్రయోగాల బ్రాండ్ అంబాసిడర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు, ఆయన వయస్సు 94 ఏళ్లు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (అక్టోబర్ 3) తుదిశ్వాస విడిచారు.
1931 సెప్టెంబర్ 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తనవైన వినూత్న ప్రయోగాలతో సింగీతం శ్రీనివాసరావు దక్షిణ భారత సినిమా రూపురేకలను పూర్తిగా మార్చివేశారు. వాణిజ్య సూత్రాలకు కట్టుబడకుండా, వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించి ఆయన సినిమాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
ఒక్క మాట కూడా లేకుండా, కేవలం హావభావాలతో తెరకెక్కిన మూకీ చిత్రం 'పుష్పక విమానం' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, తెలుగు తెరపై తొలి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఆదిత్య 369 అపూర్వ విజయాన్ని అందుకుంది. అలాగే జానపద చిత్రాలకు సరికొత్త జీవం పోసిన భైరవద్వీపం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో లెజెండరీ నటులు డాక్టర్ రాజ్‌కుమార్, విశ్వనటుడు కమల్ హాసన్‌లతో ఆయన చేసిన కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద చరిత్రాత్మక విజయాలను నమోదు చేశాయి.

కమల్ హాసన్‌తో తెరకెక్కించిన అపూర్వ సహోదరరులు, 'మైఖేల్ మదన కామరాజు, అమావాస్య చంద్రుడు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. 94 ఏళ్ల వయసులోనూ సినిమాపై మక్కువతో చాటుకుంటూ, నాగ్ అశ్విన్ నిర్మాణంలో స్వప్న సినిమా బ్యానర్‌పై సింగ్ గీతం అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి దర్శకత్వం వహించి యువ దర్శకులకు సైతం ఆదర్శంగా నిలిచారు.

తన కెరీర్‌లో 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 5 నంది అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 3 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో పాటు 2011లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు, చలనచిత్రపరిశ్రమకుర సింగీతం అందించిన సేవలు మరువరానివని పేర్కొన్నారు.
[Singeetham Srinivasa Rao, Veteran Director Passes Away, Tollywood, Aditya 369, Pushpaka Vimanam, Legendary Filmmaker, Bhairava Dweepam, Telugu One]


