ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!
Published on: Mon Nov 9, 2026 9:41AM
ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే సూత్రాలివి..!
.webp)
నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో, వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
నీరు..
రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది.
కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి.
.webp)
ఆహారం..
ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్‌తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే!
అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు.
అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట.
వ్యాయామం..
ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
మీకు నచ్చవచ్చు ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!
*రూపశ్రీ.


