భారత్లో సరికొత్త చరిత్ర: 18.2% వద్ధితో దూసుకెళ్తున్న ఆటోమొబైల్ అమ్మకాలు!
Published on: Fri Oct 16, 2026 9:43AM

భారతీయ ఆటోమొబైల్ రంగం సరికొత్త మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) దేశీయ ఆటోమొబైల్ విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. అన్ని ప్రధాన వాహన విభాగాలను కలుపుకుని మొత్తం 83.88 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 18.2 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్యాసింజర్ వెహికల్స్, టూ-వీలర్లు, త్రీ-వీలర్లు మరియు కమర్షియల్ వెహికల్స్ ఇలా ప్రతి విభాగం కూడా తమ సర్వకాలిక గరిష్ట త్రైమాసిక విక్రయాలను నమోదు చేసి ఆటో రంగానికి సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి.
ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తూ, జిఎసటి (GST 2.0) సంస్కరణల ద్వారా మెరుగైన కొనుగోలు శక్తి పెరగడం, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ నిలకడగా ఉండటం, అలాగే దేశవ్యాప్తంగా జోరందుకున్న మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు దోహదపడ్డాయని సియామ్ ప్రెసిడెంట్ శేను అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్స్ విభాగం 30.7 శాతం వృద్ధితో 13.61 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇందులోనూ ఎస్యూవీ (Utility Vehicles) వాహనాల జోరు కొనసాగుతూ ఏకంగా 68 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్నాయి. ఎస్యూవీల విక్రయాలు 34.2 శాతం ఎగబాకగా, సాధారణ కార్ల విక్రయాలు కూడా 24.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
(12).webp)
ఇక టూ-వీలర్ రంగం విషయానికి వస్తే, మొత్తం 64.33 లక్షల యూనిట్ల విక్రయాలతో 15.2 శాతం వృద్ధి సాధించింది. ఇందులో స్కూటర్ల అమ్మకాలు ఏకంగా 27.7 శాతం వృద్ధిని నమోదు చేసి మోటార్ సైకిళ్ల (7.4 శాతం) కంటే ముందంజలో నిలిచాయి. మరోవైపు, లాస్ట్-మైల్ మొబిలిటీ మరియు ఈవీ రంగం పుణ్యమా అని త్రీ-వీలర్ల విక్రయాలు 23.6 శాతం వృద్ధితో 2.85 లక్షలకు చేరగా, కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు 28.7 శాతం పెరిగి 3.09 లక్షల యూనిట్లను తాకాయి. ఎగుమతుల పరంగా కూడా టూ-వీలర్లు 27.7 శాతం వృద్ధితో 16.5 లక్షలకు, త్రీ-వీలర్లు 30.4 శాతం వృద్ధితో 1.6 లక్షలకు చేరుకున్నాయి. పండుగ సీజన్ డిమాండ్ మరియు రాబోయే రోజుల్లో ప్రభుత్వ మౌలిక సదుపాయాల పెట్టుబడుల కారణంగా ఈ జోరు మరింత కాలం కొనసాగుతుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
[Indian Automobile Sales 2026, SIAM Report, Automobile Sales Growth India, GST 2.0 Reforms, Passenger Vehicle Sales, SUV Market Share India, Two Wheeler Sales, Three Wheeler Sales, Commercial Vehicle Sales, Indian Auto Industry]


