TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా..ఈ నిజాలు తెలుసుకోండి..!

Published on: Sun Oct 25, 2026 3:14PM

కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా ? ఈ నిజాలు తెలుసుకోండి..!

ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజువారి అలసటను పారద్రోలి, మనసును తేలికపరచడంలో కాఫీ, టీలు ఎంతగానో సహాయపడతాయి. అయితే, మనలో చాలామందికి కాఫీ లేదా టీ తాగడానికి కొద్ది నిమిషాల ముందు కాస్త మంచినీరు  తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటూ ఉంటుంది. కొందరైతే కాఫీ, టీ తాగడానికి ముందు నీరు తాగితే కడుపులో యాసిడ్లు పల్చబడిపోతాయని, దానివల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని చెబుతుంటారు. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, అసలు సైన్స్ ఏం చెబుతుందో  వివరంగా తెలుసుకుంటే..

ఎసిడిటీ పెరుగుతుందా?

కాఫీ ,  టీ తాగడానికి ముందు మంచి నీరు తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుందని అనుకోవడం కేవలం ఒక పొరపాటు లేదా  అపోహ మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, టీ లేదా కాఫీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరానికి , జీర్ణవ్యవస్థకు  అనేక రకాల ప్రయోజనాలను పొందుతాయి.

కెఫీన్ ప్రభావం తగ్గిస్తుంది..

కాఫీ , తేయాకులలో సహజంగానే కెఫిన్ తో పాటు కొంతవరకు యాసిడ్ స్వభావం ఉంటుంది. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో వీటిని నేరుగా తాగినప్పుడు, కడుపులోని పొరలు చికాకుకు గురై ఎసిడిటీ, గుండెల్లో మంట, లేదా కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అయితే, కాఫీ లేదా టీ తాగడానికి ఐదు నుండి పది నిమిషాల ముందు సాధారణ నీటిని తాగడం వల్ల, ఆ నీరు పొట్టలోని యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇది ఒక రక్షణ పొరలా పనిచేసి, కెఫిన్ పొట్ట గోడలపై నేరుగా చూపించే తీవ్ర ప్రభావాన్ని తగ్గిస్తుంది.

నీరు తాగడం వల్ల కడుపులోని  రసాలు పల్చబడి జీర్ణక్రియ పాడవుతుందని అనుకుంటారు. మనం తాగే ఒక గ్లాసు నీరు పొట్టలో చాలా వేగంగా శోషించబడుతుంది. అంతేకాకుండా, నీరు పొట్టను జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్ వల్ల కడుపులో కలిగే మంటను నివారించడంలో ఈ నీరు ఎంతగానో తోడ్పడుతుంది.

 నోటి ఆరోగ్యం..

టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలోని రసాయనాలు దంతాలపై పసుపు రంగు మరకలను ఏర్పరుస్తాయి. అంతేకాకుండా దంతాల ఎనామిల్ ను బలహీనపరుస్తాయి. కాఫీ లేదా టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల నోటిలోని పిహెచ్ స్థాయిలు సమతుల్యంగా మారి దంతాల ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే, కాఫీ, టీలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహేడ్రేషన్ కు  గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ముందుగానే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

చివరిగా..

కాఫీ లేదా టీ తాగడానికి ముందు కొద్దిగా  సాధారణ నీటిని తాగడం చాలా మంచి అలవాటు. ఇది ఎసిడిటీని పెంచకపోగా, మరింత తగ్గించి జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి  టీ లేదా కాఫీకి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా  నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే..

                                                                                                                                             *రూపశ్రీ.