ఆరు నెలల్లో షిండే సర్కార్ పతనం.. మమత జోస్యం

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ పతనాన్ని విపక్షాలు ఇప్పటికీ జీర్ణం చేసుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల ముందు విపక్షాల బలాన్ని   చీల్చిన ఈ ఘటన బీజేపీయేతర పార్టీల ఐక్యతపై, బలంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. విపక్షాల ఐక్యతకు ఇరుసుగా ఇంత కాలం నిలిచిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోవడం రాష్ట్రపతి ఎన్నికల ముందు విపక్షాలకు తేరుకోలేని దెబ్బగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలో  విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయంలో కీలక భూమిక పోషించిన తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శివసేనను చీల్చి బీజేపీతో కలిసి మహారాష్ట్రలో షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సహించలేకపోతున్నారు. ఈ చీలిక రాష్ట్రపతి ఎన్నికలో ముర్ము విజయాన్ని లాంఛనం చేయడానికేనని ఇప్పటికే ఆమె బీజేపీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఇప్పుడు ఆమె మహారాష్ట్రలో కొలువుదీరిన షిండే సర్కార్ భివిష్యత్ చెప్పేశారు. షిండే సర్కార్ మరో ఆరు నెలల్లో కుప్ప కూలడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈస్ట్-2022’లో పాల్గొన్న మమత మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగుతుందని తాను భావించడం లేదన్నారు.

షిండే ప్రభుత్వాన్ని అనైతిక, అప్రజాస్వామిక సర్కారుగా అభివర్ణించారు. వారు ప్రభుత్వాన్నైతే ఏర్పాటు చేశారు కానీ, ప్రజల హృదయాలలో స్థానం కోల్పోయారని మమత పేర్కొన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన వారికి, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపైనా మమత స్పందించారు.

తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా? అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న బీజేపీ అమిత్ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి ఎలా దక్కిందని ప్రశ్నించారు.