TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి టు కాశీ: బైక్ యాత్ర.. మోడీ స్పందనేంటంటే.?

Published on: Thu Oct 8, 2026 10:07AM

ప్రభుత్వాధినేతగా నరేంద్రమోడీ పాతికేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు చేపట్టిన సేవా సంకల్ప యాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి టు వారణాసికి సాగిన ఈ సంకల్ప యాత్రపై  ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్‌లపై ప్రయాణించి, కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకెళ్లిన వీరిని  అభినందించారు.

టీఎన్‌ఎస్ఎఫ్‌, తెలుగు యువత ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న తిరుపతి  నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు పాతిక మంది యువ బైకర్లు ఈ యాత్రలో ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ మీదుగా ఈ యాత్ర వారణాసి చేరుకుంది.  2 వేల కిలోమీటర్లకు పైగా బైక్‌లపై ప్రయాణించి వీరు గమ్యం చేరుకున్నారు.   దేశ అభివృద్ధి, సుపరిపాలన, ఆర్థిక పురోగతి, మౌలిక వసతుల విస్తరణలో మోదీ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర ఉద్దేశమని వారు పేర్కొన్నారు. 

యాత్రలో మరో ప్రత్యేకతగా కృష్ణా, గోదావరి నదుల నుంచి పవిత్ర జలాలను సేకరించి కాశీకి తీసుకెళ్లారు. ఆ జలాలను గంగానదికి సమర్పించారు. కాశీ చేరుకున్న యాత్రికులకు అక్కడి టీడీపీ నేతలు, ఎంపీలు, ఉత్తరప్రదేశ్‌ ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ యాత్రపై ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గత కొన్ని రోజులుగా ప్రజలు తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్ యాత్ర చేపట్టారని తెలిపారు. సేవ,  సుపరిపాలనను ప్రధాన అంశాలుగా చేసుకుని సాగిన ఈ యాత్ర తనను ఆకట్టుకుందన్నారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను కాశీకి తీసుకురావడం తన హృదయాన్ని కదిలించిందని మోడీ పేర్కొన్నారు. 

యాత్రను నిర్వహించిన టీడీపీ నేతలు, కార్యకర్తలను  మోదీ అభినందించారు. అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసిన బృందాన్ని ప్రశంసించారు. టీడీపీ ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఈ యాత్ర రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. 

[Seva Sankalpa Yatra, Tirupati Kashi Bike Yatra, Narendra Modi 25 Years, Modis Response, TDP Bike Yatra, Krishna Godavari Waters, TNSF, Telugu Yuvatha, telugu One]