TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇరాక్ దాడుల వెనుక రష్యా సహకారం.. నిఘా సమాచారాన్ని ఇచ్చి పడేసింది.!

Published on: Wed Sep 16, 2026 3:03PM

 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముసరుకుంటున్నాయి. అమెరికాకు చెందిన కీలకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ఆస్తులపై ఇరాన్ జరిపిన ప్రతి  దాడుల వెనుక రష్యా   అధునాతన ఉపగ్రహాల హస్తం ఉందనే వాదనలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి.   ఈ సరికొత్త పరిణామం ప్రపంచ దేశాల దౌత్య సంబంధాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా రక్షణ రంగానికి, దాని మిత్రదేశాలకు ఇరాన్ కు రష్యా సమాచారం వార్త   ఆందోళనకరమైన పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 

ఇరాన్ దాడుల  దాడుల వెనుక రష్యా సాంకేతిక సహకారం గురించి నిఘా వర్గాలు పలు కీలక విషయాలను వెల్లడించాయి. మాస్కో అందించిన ఖచ్చితమైన గూఢచార చిత్రాలు, మ్యాపింగ్ డేటా సహాయంతోనే  ఇరాన్  తన క్షిపణులు,  డ్రోన్ల ద్వారా లక్ష్యాలను సులభంగా ఛేదించగలిగిందని నివేదికలు చెబుతున్నాయి. సుదూర ప్రాంతాలలో ఉన్న అమెరికా మరియు,  దాని మిత్రదేశాల బలగాల కదలికలను ముందే పసిగట్టడంలో రష్యాకు చెందిన నిఘా ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించాయని అంటున్నాయి. వ్యూహాత్మక సమాచార మార్పిడి ద్వారా  ఇరాన్, రష్యాలు రక్షణ రంగంలో తమ సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాయన్న అనుమానాలు బలపడేందుకు ఇది దోహదం చేస్తున్నది. 

ఈ తరహా సాంకేతిక మద్దతు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా పలు దేశాల పరిధిలో విస్తరించి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలోని వివిధ వ్యూహాత్మక ప్రాంతాలు, సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలు,  కీలక మౌలిక వసతులపై రష్యా ఉపగ్రహాలు నిరంతరం నిఘా ఉంచిఅందుకు సంబంధించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి ఇరాన్ బలగాలకు అందించడం వలనే ఇరాన్ అత్యంత కచ్చితత్వంతో దాడులకు పాల్పడగలుగుతోందని అంటున్నారు. 

ఈ అనూహ్య పరిణామాల పట్ల వాషింగ్టన్ అప్రమత్తమైంది. గ్లోబల్ భద్రతా సమీకరణాలలో అనూహ్య మార్పులు వస్తున్న తరుణంలో, అమెరికా తన రక్షణ వ్యూహాలను మార్చుకోక తప్పని అనవార్య పరిస్థితిలోకి వెళ్లింది. రష్యా, ఇరాన్ దేశాల మధ్య ఏర్పడిన ఈ రహస్య ఒప్పందాలు అంతర్జాతీయ శాంతికి భంగం కలిగిస్తున్నాయని అమెరికా మండిపడుతోంది.  భవిష్యత్తులో ఈ తరహా ఉమ్మడి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపై అగ్రరాజ్యం నిశితంగా పరిశీలిస్తోంది. 

చాలా కాలంగా అంతర్జాతీయ వేదికలపై అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాస్కో, ఇరాన్ లు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే..  నేరుగా ఉపగ్రహ సాంకేతికత గూఢచార సమాచారాన్ని పంచుకోవడం ద్వారా అమెరికా ఆస్తులను టార్గెట్ చేయడంలో రష్యా ఇరాన్ కు సహకరించడం, సాయం చేయడం అన్నది ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.  ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత పశ్చిమాసియాలో రష్యా తన ప్రాభవాన్ని చాటుకోవడానికి, అమెరికాను ఇరుకున పెట్టడానికి ఈ వ్యూహాన్ని ఎంచుకుందని అంతర్జాతీయ దౌత్య రంగ నిపుణులు అంటున్నారు. 

ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య విభేదాలు పెచ్చరిల్లి, ప్రమాదకర  ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యర్థులకు బదిలీ చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలకు రష్యా తూట్లు పొడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మరోవైపు, ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి రష్యా సహాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటోంది అనే దానిపై నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. 

భవిష్యత్తులో పశ్చిమాసియాలో శాంతిభద్రతల పరిరక్షణ మరింత క్లిష్టతరంగా మారనుందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా తన దళాల రక్షణ కోసం మరిన్ని కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కేవలం భౌతిక దాడులే కాకుండా సైబర్ భద్రత,   డిజిటల్ నిఘా రంగాలలో కూడా రష్యా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయనే ఆరోపణలు.. రానున్న రోజుల్లో   దౌత్యపరమైన ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.  

[satellites, Iranian attacks, US bases, West Asian tensions, intelligence information, Telugu One]