ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఎంట్రీ.. 70 స్థానాల్లో పోటీకి ఎస్ఎస్పీ సిద్ధం.!
Published on: Wed Oct 28, 2026 7:45PM

డెహ్రాడూన్లో సర్వజన్ సనాతన్ పార్టీ (SSP) జాతీయ అధ్యక్షుడు, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు ‘పర్వతోదయ సంకల్ప్–దేవభూమికి నూతన ఉదయం’ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ప్రజాకేంద్రిత పాలన, ఉపాధి అవకాశాల కల్పన, భారతీయ నాగరికతా విలువల పరిరక్షణ తమ పార్టీ లక్ష్యాలని ప్రకటించారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 26 ఏళ్ల పాలనలో వలసలు తగ్గలేదని, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు తగిన అవకాశాలు అందలేదని ఆయన విమర్శించారు. పర్వత ప్రాంతాల్లో స్థానిక ఉపాధి కోసం 20 హిల్ గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వ్యవసాయం, పర్యాటకం, ఆహార శుద్ధి, డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తామని తెలిపారు.
దేవభూమి సాంస్కృతిక వారసత్వం, సనాతన విలువలను కాపాడటంతోపాటు స్థానికుల భూముల హక్కుల పరిరక్షణకు పటిష్టమైన, పారదర్శకమైన భూ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. లివ్-ఇన్ సంబంధాలపై యూసీసీలోని మూడో భాగాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీపై విమర్శలు చేసిన నాగేశ్వరరావు, అవసరాల ఆధారంగా ‘యుక్త్-ఆరక్షణ్’ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, సంబంధిత యూజీసీ నిబంధనలను రద్దు చేస్తామని కూడా ప్రకటించారు.
అంకితా భండారీ కేసులో బాధ్యులైన వారందరికీ శిక్ష పడేలా చూస్తామని, పరీక్షల్లో అక్రమాలను అరికట్టి ప్రతిభకు ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటిస్తూ, తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. “కాంగ్రెస్, బీజేపీలకు 26 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాఖండ్ భవిష్యత్తును భద్రపరిచేందుకు సర్వజన్ సనాతన్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి” అని కోరారు.
[ Sarvjan Sanatan Party, SSP, M Nageswara Rao, Former CBI Director, Parvatodaya Sankalp, Uttarakhand Assembly Elections 2027, Dehradun News, Uttarakhand Development, Hill Growth Centres, Bhu Kanoon, Uniform Civil Code, UCC, Yukt Arakshan, Ankita Bhandari Case, BJP, Congress, Sanatan Values, Uttarakhand Politics, Employment Opportunities, Uttarakhand News, Indian Politics ]


