సంజుక్తా పరాశర్‌కు అరుదైన బాధ్యత.. CRPF కోబ్రాకు తొలి మహిళా IGగా నియామకం
Published on: Fri Sep 18, 2026 10:08AM
.webp)
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2006 బ్యాచ్‌కు చెందిన సంజుక్తా పరాశర్ అస్సాం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి. కమాండో బటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్‌గా పిలిచే కోబ్రా దళం ప్రత్యేకంగా అడవి యుద్ధం, గెరిల్లా ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో మొత్తం పది బెటాలియన్లు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విభాగానికి మహిళా అధికారి నాయకత్వం వహించలేదు. సంజుక్తా పరాశర్ గతంలో అస్సాం పోలీస్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లోనూ ఆమె పనిచేశారు. కౌంటర్ ఇన్‌సర్జెన్సీ, భద్రతా కార్యకలాపాల్లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది. అస్సాంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా పనిచేయడంతో ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ అస్సాం’ అనే పేరు వచ్చింది. అడవుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసిన అనుభవం ఆమె కెరీర్‌లో ముఖ్యమైన అంశంగా నిలిచింది. కోబ్రా దళాలు ప్రధానంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అడవి యుద్ధం, ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తాయి. మణిపూర్‌లో సాయుధ హింసను నియంత్రించేందుకు ఇటీవల కోబ్రా యూనిట్లను కూడా మోహరించారు. సంజుక్తా పరాశర్ నియామకం భారత భద్రతా దళాల్లో మహిళలకు పెరుగుతున్న నాయకత్వ అవకాశాలకు మరో ఉదాహరణగా నిలిచింది. ఆమెకు ఉన్న కౌంటర్ ఇన్‌సర్జెన్సీ, జాతీయ భద్రతా వ్యవహారాల అనుభవం కొత్త బాధ్యతల్లో కీలకంగా ఉండనుంది. కోబ్రా తొలి మహిళా ఐజీగా సంజుక్తా పరాశర్ బాధ్యతలు చేపట్టడం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.


