వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు జలసమాధి..!
Published on: Wed Sep 16, 2026 8:43PM

వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది. మేళతాళాలు, డ్యాన్సులు, జైజైకారాలతో ప్రారంభమైన నిమజ్జన వేడుక.. కాసేపటికే ఆరు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని కంచర్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వినాయక చవితి వేడుకల్లో భాగంగా శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులు నిమజ్జనం కోసం చెరువు వద్దకు వెళ్లారు. ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. విగ్రహ నిమజ్జనం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా చెరువు నుంచి బయటకు వచ్చారు. అయితే ఆరుగురు విద్యార్థులు మాత్రం బయటకు రాకపోవడంతో అనుమానం మొదలైంది.
విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికులతో కలిసి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు క్షేమంగా బయటపడాలని అందరూ ఆశించినప్పటికీ.. చివరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు.
మృతుల్లో నర్సింహ రాజు, సుమంత్, గణేష్, ఉదయ్ కిరణ్, శ్యామ్ కుమార్, సిద్దార్థ్ ఉన్నారు. వీరిలో సుమంత్, గణేష్ డిప్లొమా రెండో సంవత్సరం, ఉదయ్ కిరణ్ డిప్లొమా మూడో సంవత్సరం, శ్యామ్ కుమార్ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. సిద్దార్థ్ పదో తరగతి విద్యార్థిగా గుర్తించారు.
చదువులు పూర్తి చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని కలలు కంటున్న విద్యార్థుల జీవితాలు ఒక్కసారిగా విషాదాంతమయ్యాయి. నిమజ్జనానికి వెళ్లిన విద్యార్థులు మృతి చెందారన్న వార్త తెలియడంతో కంచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురుచూసిన తల్లిదండ్రులకు చివరకు విషాద వార్త వినాల్సి వచ్చింది.
ఒక్కసారిగా ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పండుగ రోజు పిల్లలతో ఆనందాన్ని పంచుకోవాల్సిన కుటుంబాలు.. వారి మృతదేహాలను చూసి కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[ sangareddy news, patancheru tragedy, ganesh immersion accident, six students drowned, telangana news, vinayaka chavithi tragedy, cm revanth reddy, cp sajjanar,DGP C,V, Anand ]


