ఇసుక మాఫియాపై అధికారుల ఉక్కుపాదం: సర్వే నెంబర్ 134లో మెరుపు దాడులు!
Published on: Tue Sep 8, 2026 9:29AM
.webp)
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలో అక్రమంగా సాగుతున్న ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉక్కుపాదం మోపింది. కంది మండలం మరియు సంగారెడ్డి మండల శివారు ప్రాంతాల్లో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక నెట్‌వర్క్‌ను ఛేదించడానికి అధికారులు ఉమ్మడిగా రంగంలోకి దిగారు. ఇటీవల దిశ పత్రికలో ఇసుక దందాలో వేలంపాట . అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (AD) తో పాటు స్థానిక రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో ఒకేసారి పలు ప్రాంతాలపై మెరుపు దాడులు నిర్వహించి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.
వివరాల్లోకి వెళ్తే, కంది మండల పరిధిలోని ఎర్ధనూర్ మరియు బ్యాతోల్ గ్రామాల శివారు ప్రాంతాల్లో విస్తృతంగా సాగుతున్న అక్రమ ఇసుక తయారీ కేంద్రాలపై అధికారులు దృష్టి సారించారు. ముఖ్యంగా ఎర్ధనూర్ శివారులోని సర్వే నెంబర్ 134 లో నక్క వాగును ఆసరాగా చేసుకుని ఏకంగా 6 అక్రమ ఇసుక ఫిల్టర్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తనిఖీల్లో నిర్ధారించారు. స్థానిక పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, వాగు రూపురేఖలను మారుస్తున్న ఈ 6 ఇసుక ఫిల్టర్లను అధికారులు పొక్లెయిన్ల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేసి కూల్చివేశారు. సహజ వనరులను విచక్షణారహితంగా దోచుకుంటున్న అక్రమార్కులకు ఈ చర్యలు ఒక బలమైన హెచ్చరికగా నిలిచాయి.
అయితే, ఇదే మండలంలోని ఆరుట్ల మరియు చిదురుప్ప ప్రాంతాల్లో కూడా అక్రమ ఇసుక ఫిల్టర్ల కార్యకలాపాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా అధికారులు ఈ ప్రాంతాలపై దాడులు చేసి ఫిల్టర్లను కూల్చివేసినప్పటికీ, అధికారులు వెళ్లిపోగానే దందారాయుళ్లు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించడం పట్ల స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్ పేట పరిధిలో కూడా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే అధికారుల రాకను ముందే పసిగట్టిన దందారాయుళ్లు అక్కడి నుంచి తమ టిప్పర్లు, ఎక్సవేటర్లు, ఇతర భారీ యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ఈ కీలకమైన దాడుల్లో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజు, ఏడి మైన్స్ సంగారెడ్డి అధికారి డాక్టర్ విజయకుమార్, రెవెన్యూ ఆర్ఐ విజయ్ మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడి మైనింగ్ అధికారి డాక్టర్ విజయకుమార్ స్పందిస్తూ.. వాల్టా (WALTA) చట్ట నిబంధనలను ఉల్లంఘించి నక్క వాగు పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే వరుస దాడులు నిర్వహించడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తేనే ఈ అక్రమ దందాకు శాశ్వతంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Telangana Mining Department sand raids, Sangareddy Walta Act sand crackdown.


