సంచలన తీర్పులు... ఒకటే రోజు నాలుగు అత్యాచార కేసులకు తుది తీర్పు

తెలంగాణలో సంచలనం సృష్టించిన నాలుగు అత్యాచార ఘటనల పై నేడు ( జనవరి 27వ తేదీన )  తీర్పులు వెలువడనున్నాయి. అటు హాజీపూర్ ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగు చూసిన దారుణాలకు  న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనుంది. ఏ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టులో తీర్పు ఇవ్వనుంది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎలా పట్టారు గ్రామ అటవీ ప్రాంతంలో గత నవంబరు 24 న సమత పై అదే గ్రామానికి చెందిన షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మగ్దూమ్ లు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వేగంగా విచారించేందుకు డిసెంబరు 11 న ఆదిలాబాద్ లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. పోలీసులు ముగ్గురు నిందితుల పై డిసెంబరు 14 న 144 పేజీల చార్జి షీటును దాఖలు చేశారు.

నిందితుల తరపున కేసును వాదించేందుకు న్యాయవాదులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో కోర్టు నిందితులకు న్యాయవాదిని కేటాయించింది. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, పోలీసు రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు.. మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించగా డిసెంబరు 31వ తేదీతో విచారణ పూర్తయింది. ఈ నెల ( జనవరి ) 20 తో ప్రాసిక్యూషన్.. డిఫెన్స్ లాయర్ల మధ్య వాదనలు ముగియగా నేడు తీర్పు రానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ కు చెందిన ముగ్గురు అమ్మాయిల పై వేర్వేరు ఘటనల్లో శ్రీనివాసరెడ్డి అత్యాచారానికి పాల్పడి హతమార్చాడని పోలీసులు నల్గొండ న్యాయస్థానంలో అభియోగాలు మోపారు. హాజీపూర్ కేసులో గత ఏడాది అక్టోబర్ 20 న విచారణ ప్రారంభం కాగా 44 మంది సాక్షులను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఆయా కేసులో గత డిసెంబర్ 26వ తేదీన వాదనలు ముగిశాయి.