TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉబెర్ డ్రైవర్ నుంచి ఆసియా గేమ్స్ స్టార్.. పేదరికాన్ని జయించిన ఛాంపియన్!

Published on: Thu Sep 24, 2026 10:46AM

జీవితం విసిరే సవాళ్లకు లొంగిపోకుండా, తీవ్రమైన పేదరికాన్ని జయించి దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేసిన ఒక సాధారణ యువకుడి కథ ఇది. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా పూర్ ధింగై గ్రామంలో ఆగస్టు 15, 1998న జన్మించిన సల్మాన్ ఖాన్ జీవితం ప్రారంభం నుంచి అడుగడుగునా కష్టాలతోనే సాగింది. నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులతో కూడిన పెద్ద కుటుంబంలో సల్మాన్ జేష్ఠ పుత్రుడు. తండ్రి మొహమ్మద్ కాసిమ్ ఖాన్ హర్యానాలోని తౌరూలో ట్రక్ బాడీ కన్స్ట్రక్షన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే, సల్మాన్‌కు 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు డెంగ్యూ వ్యాధితో తండ్రి అకస్మాత్తుగా కన్నుమూశారు. దాంతో కుటుంబ భారం మొత్తం ఒకేసారి సల్మాన్ భుజాలపై పడింది. ఆర్మీలో చేరాలనే తన కలలను పక్కనబెట్టి, కుటుంబ పోషణ కోసం ఢిల్లీ వీధుల్లో Uber క్యాబ్ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. పగలు, రాత్రి తేడా లేకుండా క్యాబ్ నడుపుతూ తోబుట్టువుల చదువు, కుటుంబ పోషణ బాధ్యతలను నెరవేర్చాడు.

అయితే, విధి అతడిని డ్రైవింగ్ సీటుకే పరిమితం చేయలేదు. ఒక మిత్రుడి సలహాతో తన శారీరక దార్ఢ్యాన్ని నమ్ముకుని, క్యాబ్‌ను వేరొకరికి అప్పగించి కేవలం 4 నెలల కఠోర సాధనతో 2018 సెప్టెంబర్ 25న బొంబాయి ఇంజనీర్ గ్రూప్ (BEG) ద్వారా ఇండియన్ ఆర్మీలో 122 ఇంజనీరింగ్ రెజిమెంట్‌లో చేరాడు. ఆర్మీలో చేరిన తర్వాత సత్యవాన్, సతీష్ సిరాత్, ప్రభాత్ మిశ్రా అనే కోచ్‌లు సల్మాన్ ఎత్తు, శారీరక దార్ఢ్యాన్ని గమనించి రోయింగ్ (పడవ పందెం) క్రీడ వైపు ప్రోత్సహించారు. మొదట్లో రోయింగ్ పట్ల ఆసక్తి లేకపోయినా, కోచ్‌ల పట్టుదలతో పడవలో కాలుపెట్టిన సల్మాన్, తన తొలి ఇంటర్-సెంటర్ రెగట్టాలోనే రజత పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2021లో ఎర్గోమీటర్ బెంచ్‌మార్క్‌లను దాటి పుణేలోని సెంటర్ ఫర్ మిలిటరీ ఇంజనీరింగ్ (CME) లోని ఆర్మీ రోయింగ్ నోడ్ (ARN) కి ఎంపికయ్యాడు. 2022లో గుజరాత్‌లో జరిగిన 36వ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణం, 2023 సీనియర్ నేషనల్స్‌లో ఒలింపియన్ దత్తు భోకనాల్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయాలతో అతడికి ఆర్మీలో నాయబ్ సుబేదార్‌గా పదోన్నతి లభించింది.

ఈ అసాధారణ క్రమశిక్షణ, కృషి సల్మాన్‌ను ఆసియా క్రీడల వేదికపైకి తీసుకెళ్లాయి. జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా 2026 సెప్టెంబర్ 24 గురువారం రోజున జరిగిన ఆసియా గేమ్స్ పురుషుల డబుల్ స్కల్స్ (M2X) ఫైనల్‌లో, సల్మాన్ ఖాన్ తన భాగస్వామి సత్నామ్ సింగ్‌తో కలిసి భారత్‌కు చారిత్రాత్మక కాంస్య పతకాన్ని అందించాడు. తీవ్రమైన పోటీ మధ్య భారత ద్వయం 6:13.25 నిమిషాల సమయంతో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో చైనాకు చెందిన యీ క్సుడీ, యిడే నీ జోడీ బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన పావెల్ సోరిన్, మెఖ్రోజ్‌బెక్ మమత్కులోవ్ 6:10.49 సమయంతో రజత పతకం సాధించారు. రేసులోని 500 మీటర్లు, 1000 మీటర్లు, 1500 మీటర్ల మార్క్ వరకు భారత జోడీ రెండో స్థానంలో కొనసాగి, చివరి 500 మీటర్లలో స్వల్ప తేడాతో మూడో స్థానానికి పరిమితమైనప్పటికీ, ఈ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారు. ఢిల్లీ వీధుల్లో రోడ్లపై క్యాబ్ తోలిన చేతులతోనే ఈరోజు ఆసియా గేమ్స్ వేదికపై పడవల తెడ్డు పట్టి పతకం గెలవడం సల్మాన్ ఖాన్ పట్టుదలకు నిదర్శనం.

 

 

 

[Salman Khan, Asian Games 2026, Indian Rowing, Rowing Bronze Medal, Satnam Singh, India Rowing Team, Uber Driver, Indian Army, M2X Double Sculls, Aichi Nagoya 2026]