అది సుప్రీం తీర్పుని ప్రశ్నించడమే!

 

ముంబై ప్రేలుళ్ళ కేసులో ప్రధాన పాత్రధారి యాకుబ్ మీమన్ కి ఈనెల 30న నాగపూర్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయబోతున్నట్లు వార్త వెలువడగానే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా “అతనిని ఉరి తీయవద్దు, ఆ నేరానికి పాల్పడిన అతని సోదరుడు టైగర్ మీమన్ని ఉరి తీయండి” అని ఒక ట్వీట్ మెసేజ్ పెట్టారు.

 

ఊహించినట్లే దానిపై సర్వత్రా నిరసనలు వెలువెత్తాయి. దానితో ఆయన మళ్ళీ మరొక ట్వీట్ మెసేజ్ లో, “యాకూబ్ మెమన్ నిర్దోషి అని నేను కూడా భావించడం లేదు. కానీ అన్నకి బదులుగా తమ్ముడు ఉరికంబం ఎక్కుతున్నాడనే ఉద్దేశ్యంతో మానవతా దృక్పదంతోనే అతనిని ఉరి తీయవద్దని కోరాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. మన న్యాయవ్యవస్థల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. ముంబై బాంబు ప్రేలుళ్ళలో అనేకమంది అమాయకులయిన ప్రజలు చనిపోయారు. ఒక్క మనిషి ప్రాణం పోయినా అది మానవత్వానికి మచ్చ వంటిదేనని ఇది వరకు చాలాసార్లు చెప్పాను. ఆ ఉద్దేశ్యంతోనే యాకుబ్ కి ఉరి వద్దన్నాను. కానీ ఉద్దేశ్యపూర్వకంగా ఆవిధంగా అనలేదు. ఒకవేళ నా అభిప్రాయలు ఎవరి మనసులనయినా నొప్పించి ఉంటే వారందరికీ బేషరతుగా క్షమాపణలు చెపుతున్నాను,” అని అన్నారు.

 

రాజకీయాలలో ఉన్న అసదుద్దీన్ వంటి నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనినొక అవకాశంగా వాడుకోవడం సహజం. కేవలం హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమయిన తన మజ్లీస్ పార్టీని యావత్ రాష్ట్రంలో ఇంకా వీలయితే యావత్ భారతదేశంలో విస్తరించాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ చాలా కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకు యాకుబ్ మీమన్ ఉరి శిక్షని వ్యతిరేకిస్తూ గట్టిగా వాదిస్తుండవచ్చును. కానీ ప్రజలు, రాజకీయ పార్టీలు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యల పట్ల స్పందించినట్లుగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించడం లేదనే విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంది. అందుకు కారణం అసదుద్దీన్ రాజకీయాలలో ఉండటం సల్మాన్ సినీ పరిశ్రమలో ఉండటమే. ఒకవేళ సల్మాన్ ఖాన్ కి ఎదురయిన పరిస్థితే అసదుద్దీన్ ఓవైసీకి కూడా ఎదురయి ఉండి ఉంటే అప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ లాగ క్షమాపణలు చెప్పే బదులు దానిని కూడా మరొక రాజకీయ అవకాశంగా మలుచుకొనేందుకు తప్పకుండా ప్రయత్నించేవారని చెప్పవచ్చును.

 

రాజకీయ నేతలకీ, సినీ హీరోలకి ఉన్న చిన్న తేడా అదే! ఆ విషయం తెలుసుకోకుండా నటుడు సల్మాన్ ఖాన్ అనవసరంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసి కోరుండి సమస్యలు కొని తెచ్చుకొన్నారు. కానీ ఆయన వంటి ప్రముఖులు కూడా భారతీయ న్యాయవ్యవస్థ తీర్పుపై ఈవిధంగా అనుమానాలు వ్యక్తం చేయడం సబబు కాదు. భారతీయ న్యాయవ్యవస్థలో ఎన్నో లోపాలు, చట్టాలలో ఎన్నో లొసుగులు ఉండవచ్చు గాక. కానీ వందలాది ప్రజలను అతి కిరాతకంగా కాల్చి చంపిన అజ్మల్ కసాబ్ లేదా పార్లమెంటుపై దాడికి కుట్ర పన్నిన అఫ్జల్ గురు లేదా ముంబై వరుస ప్రేలుళ్ళలో సుమారు 250 మంది ప్రజల ప్రాణాలు బలిగొన్న యాకుబ్ మీమన్ కావచ్చు...ఎంత కరుడు గట్టిన నేరస్థుడికయినా తను నిర్దోషి అని నిరూపించుకొనేందుకు మన న్యాయ వ్యవస్థ అవకాశం ఇస్తుంది.

 

అందుకే దేశంలో కోట్లాది మంది పసి పిల్లలు, వృద్దులు, ఆనాధలు తిండి, గుడ్డ, గూడు, విద్య, వైద్యం లేక రోడ్లపైనే బ్రతుకుతున్నా కసాబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మీమన్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులు శిక్ష అమలయ్యే వరకు కూడా సమస్త రాజభోగాలు అనుభవించగలుగుతున్నారు. రెండు మూడు నెలల్లో తేలవలసిన కేసులని రెండు మూడు దశాబ్దాలపాటు పొడిగించ గలుగుతున్నారు. వందలాది మంది ప్రజల ప్రాణాలను హరించిన అటువంటి కిరాతకులని ఉరి తీస్తే అది మానవత్వానికే మచ్చ అని సల్మాన్ ఖాన్ వంటి వ్యక్తి చెప్పడం చాలా తప్పు. అది ఖచ్చితంగా మన న్యాయవ్యవస్థల తీర్పులను అవమానించడమే.